విశాఖ, అనకాపల్లి జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పెద్దపులి శనివారం రాత్రి నల్లకొండ అడవుల నుంచి వెళ్లిపోయింది. పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు చంద్రయ్యపేటలో బోను ఏర్పాటు చేశారు. పులి ఇటువైపు రాకుండా చంద్రయ్యపేట నుంచి సబ్బవరం మండలం ఎల్లుప్పి మీదుగా విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మల్లివీడు చేరుకుందని ఆ జిల్లా అటవీ అధికారులు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా అధికారులకు సమాచారం అందించారు. పులి నల్లకొండ అడవుల్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున తాము అప్రమత్తంగా ఉన్నామని డీఎఫ్‌ఓ అనంతశంకర్, సబ్ డీఎఫ్‌ఓ ధర్మరక్షిత్, రేంజర్ రామ్‌నరేష్, పెందుర్తి సెక్షన్ ఫారెస్ట్ అధికారి రామారావు తెలిపారు. ఇదివరకటి మాదిరిగానే కె,కోటపాడు, సబ్బవరం, చోడవరం మండలాలకు చెందిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. పశువులను నివాసాల వద్దే ఉంచుకోవాలన్నారు.