ఒకప్పటి కర్నూలు జిల్లాలోని దోర్నాల మండలం, పెద్దచేమ గ్రామానికి చెందిన కుడుముల పాపన్న కుమారుడు పెద్దబయన్న(పెద్ద బైలోడు). పరాయి పాలకులు అటవీ సంపదను కొల్లకొట్టేందుకు నల్లమలలోకి వచ్చారు. అటవీ ఉత్పత్తులపై చెంచుల నుంచి పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టారు. చెంచులతో వ్యక్తిగత పనులు చేయించుకొనేవారు. వాళ్ల శ్రమను కొల్లగొట్టేవారు. చెంచు మహిళలపై అఘాయిత్యాలు చేసేవారు. వారు మరణిస్తే శవాలను ఎక్కడో పడేసేవారు.
ఈ దుశ్చర్యలను చూసి పెద్దబయన్న బ్రిటీష్‌వాళ్లపై కసి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నల్లమలపై తమ జెండాను ఎగరేసి అధికారాన్ని చాటుకోవాలని బ్రిటీష్ వారు అనుకున్నారు. తమ జెండాను ఎగురవేయాలని వేయాలని చెంచులను ఆదేశించారు. ఇది పెద్దబయన్న ఆగ్రహానికి కారణమైంది. తుమ్మలబయలు గ్రామాన్ని స్థావరంగా చేసుకుని బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టాడు.
నల్లమలలోని పెద్దచేమ, చింతల, మర్రిపాలెం, తుమ్మలబయలు తదితర ప్రాంతాలను బ్రిటీష్ సైన్యం అప్పటికే ఆక్రమించుకుంది. ఒక సందర్భంలో బ్రిటీష్‌వాళ్లకు పెద్దబయ్యన్న ఎదురుపడగా పెద్దచేమ కొండ మీద తమ జెండా ఎగురవేయాలని ఆదేశించారు. పెద్దబయన్న అంగీకరించలేదు. తెల్లదొరలపై విల్లంబులతో దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పెచ్చెర్వుకు చేరుకున్నారు. అప్పటి నుంచి బ్రిటీష్ వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన చెంచులతో సమావేశాలను నిర్వహించి చైతన్యపరచడం ప్రారంభించాడు. దీంతో బయన్నను మట్టుపెట్టాలని బ్రిటీష్‌వారు భావించారు. ఓరోజు తుమ్మలబయలు సమీపంలోని పిట్టబీతలబొక్క వద్ద మల్లమ్మ తల్లికి గ్రామస్థులంతా జాతర చేపట్టారు. ఆ సమయంలో పెద్దబయ్యన్న తీవ్రజ్వరంతో ఊళ్లోనే ఉండిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న బ్రిటీష్ సైన్యం తుమ్మలబయలును చుట్టుముట్టి గాలింపు చేపట్టారు. పెద్దబయన్న అమ్మమ్మ ఆయనకు దుప్పటితో కప్పివేసి దాచేసింది. బ్రిటీష్‌సైన్యం వచ్చి అడగ్గా పిట్టబీతల బొక్క వద్ద జరిగే జాతర కు వెళ్లాడని చెప్పింది. దీంతో పిట్టబీతల బొక్క ప్రదేశానికి తీసుకెళ్లాలని చీకట్లో ఆ ముసలమ్మను వేధించారు. ఇక పెద్ద బయ్యన్న జ్వరంలో కూడా బ్రిటీష్‌వారు గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని దివిటీతో తాను దారిచూపిస్తానని చెప్పి బ్రిటీష్ సైన్యాన్ని అడవిలోకి తీసుకెళ్లాడు. వారిని ఓ గుండంలో పడవేసి దివిటితో నిప్పుపెట్టి బ్రిటీష్ సైన్యాన్ని మంటలకు ఆహుతి అయ్యేలా చేశాడు. దీన్ని బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
పెద్దబయన్నను పట్టించిన వారికి రూ. 10వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఆతర్వాత పెద్దబయ్యన్న కోసం బ్రిటీష్ సైన్యం అటవీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ కాక్రేన్ పెద్దబయన్నను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. బ్రిటీష్ సైన్యం పెచ్చెర్వు గ్రామం ద్వారా తుమ్మలబయలుకు చేరుకుని చెంచులపై కాల్పులకు పాల్పడింది. తన కోసం అమాయక చెంచులు చనిపోవడం, గాయపడటం చూసి తట్టుకోలేక పెద్దబయ్యన్న బ్రిటీష్ సైన్యం ముందుకొచ్చాడు. గాయపడిన ఆయన్ను తుమ్మలబయలులోని ఓ చెట్టుకు కట్టేసి 1938 ఏప్రిల్ 25వ తేదిన కాల్చిచంపారు.