5జీ నెట్ వర్క్ లో దూసుకెళ్లాలని పావులు కదుపుతున్న టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి 5జీ ఫోన్ కూడా త్వరలో రాబోతోంది. ఈ ఏడాది లోపు 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు జియో సన్నాహాలు చేస్తోంది. వీలైతే దసరాకే కొత్త ఫోన్ తీసుకురావాలని భావిస్తోంది. ఇది ఐదు రకాల 5జీ బ్యాండ్స్ ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర కూడా పలు వర్గాలకు అందుబాటులో ఉండనుంది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండొచ్చని ఓ అంచనా.
ఫీచర్స్ విషయంలో జియో ఎక్కడా రాజీపడడంలేదు. ఇందులో ఇన్ ప్లేన్ స్విచింగ్ (ఐపీఎస్) ఎల్సీడీ డిస్ ప్లే ఏర్పాటు చేయడం విశేషం. దీని స్క్రీన్ సైజు 6.5 అంగుళాలు. ఇందులో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ప్రైమరీ కెమెరా (13 ఎంపీ)తో పాటు 2 ఎంపీ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నట్టు సమాచారం. జియో 5జీ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఓ వేరియంట్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది ప్రగతి ఓఎస్ తో నడుస్తోంది. ప్రగతి ఓఎస్ ను జియో సంస్థ గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. వేగవంతమైన కార్యకలాపాల కోసం స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్ ను పొందుపరిచినట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో సుదీర్ఘమైన పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. జియో నెక్ట్స్ ఫీచర్ ఫోన్ తరహాలోనే ఇందులో జియో యాప్స్ ఉచితం. గూగుల్ యాప్స్ కూడా ఫోన్ తో పాటే లభిస్తాయి. భారత్ లో ఇటీవలే 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడం తెలిసిందే. మరికొన్ని నెలల్లో భారత్ లో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, జియో కూడా 5జీ ఫోన్ తో ప్రత్యర్థులకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.