స్వాతంత్రోద్యమ ఫలాలను భారత ప్రజలు అనుభవిస్తున్న వేళ ఆ ఆనందాన్ని చవిచూసేందుకు నేతాజీ బతికిలేరని, ఇకనైనా ఆయన అస్థికలను భారత్ తీసుకువచ్చేందుకు కృషి చేయాలని నేతాజీ కుమార్తె అనితా బోస్ పిలుపునిచ్చారు. భారత స్వాతంత్రోద్యమ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై ఆమె స్పందిస్తూ పై విధంగా పేర్కొన్నారు. జపాన్ నుంచి అస్థికలను తీసుకువచ్చేందుకు ఇదే తగిన సమయం అని అభిప్రాయపడ్డారు.
జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలు ఉన్నాయని, ఆ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష జరిపేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించందని అనితా బోస్ వెల్లడించారు. నేతాజీ మరణంపై ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉన్నాయని, అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించడం ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేయవచ్చని తెలిపారు.
సుభాష్ చంద్రబోస్ 1945లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్టు పలు నివేదికల సారాంశం. జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్ మాత్రం విమాన ప్రమాదం తర్వాత కూడా బోస్ సజీవుడిగానే ఉన్నారని పేర్కొంది. దాంతో, టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు ఎవరివన్న విషయంలో సందేహాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో, అనితా బోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.