ఢిల్లీలో మద్యం అమ్మకాల్లో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రాకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓ వైపు సోదాలు కొనసాగుతుండగా... మద్యం అమ్మకాల్లో అవకతవకలపై పక్కా ఆధారాలు చేజిక్కించుకున్న సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా రాసేశారు. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఏ1గా పేర్కొన్న సీబీఐ అధికారులు ఏ2గా ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణ పేరును చేర్చారు.
ఢిల్లీలో మద్యం అమ్మకాల టెండర్ల సమయంలో ఢిల్లీ ఆబ్కారీ శాఖ కమిషనర్‌గా గోపీకృష్ణ వ్యవహరించారు. ఏపీకి చెందిన గోపీకృష్ణ 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దీంతో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు చేశారు. గోపీకృష్ణ ఇంటిలో అక్రమాలకు సంబంధించి పత్రాలు లభించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ కేసులో ఏ14గా బడా వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై పేరును చేర్చారు. హైదరాబాద్ వాసి అయిన పిళ్లై బెంగళూరు కేంద్రంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. పిళ్లైకి పలువురు రాజకీయ నేతలతోనూ సంబంధాలున్నట్లుగా సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.