గాంధీని చంపిన వాళ్లు తనను మాత్రం వదులుతారని తాను అనుకోవడం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. గాంధీని చంపిందీ వాళ్లే... గాంధీ ఫొటోను వాడుకునేదీ వాళ్లేనని విమర్శించారు. తన వ్యక్తిగత భద్రతపై సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కొడగు పర్యటనకు వెళ్లిన ఆయన వాహనంపై కొందరు గుడ్లు విసిరారు. నల్ల జెండాలు చూపి ఆందోళన చేశారు. ఒక వ్యక్తి సిద్ధరామయ్యపై సావర్కర్ ఫొటోను కూడా విసిరినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు (నేడు) ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ... ఎవరైనా ఆందోళన చేస్తే అభ్యంతరం లేదని... చట్టాన్ని అదుపులోకి తీసుకోవాలని చూస్తే మాత్రం క్షమించబోమని అన్నారు. సిద్ధరామయ్య చెపుతున్న మాటలు నమ్మశక్యంగా లేనప్పటికీ... ఆయనకు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేసినట్టు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సిద్ధరామయ్యకు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించినట్టు పోలీసు అధికారులు తనతో చెప్పారని తెలిపారు.