నేటీ పోటీ ప్రపంచంలో చిన్నారుల్లోసైతం అద్భుతమైన టాలెంట్ వెలుగులోకి వస్తోంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కర్ణాటకలోని ఉడుపిలో నిర్వహించిన సంబురాల్లో ఓ చిన్నారి స్టెప్పులతో అదరగొట్టింది. పులి వేషాలతో ఉన్నవారితో కలిసి వారికి దీటుగా ఆమె వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్విట్టర్ లోని విజిట్ ఉడుపి పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేయగా.. అది వైరల్ గా మారింది. చిన్నారి స్టెప్పులు భలే ఉన్నాయంటూ వ్యూస్, లైకులు పోటెత్తుతున్నాయి.
ఉడుపిలో జరుగుతున్న జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పులి వేషాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ తల్లి తన చిన్నారితో కలిసి అక్కడికి వచ్చి ఓ పులి వేష ధారికి మెడలో దండ వేసింది. తన చిన్నారిని ఆ పులి వేషధారుల వద్ద వదిలి డ్యాన్స్ చేయాల్సిందిగా సూచించి పక్కకు వెళ్లిపోయింది. వెంటనే ఆ చిన్నారి పులి నృత్యం చేయడం మొదలుపెట్టింది. అసలు పులి వేషధారి కంటే ఆ చిన్నారి వేసిన స్టెప్పులు బాగుండటంతో చుట్టూ ఉన్నవారంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ట్విట్టర్ లో పెట్టిన ఈ వీడియోకు ఏకంగా ఐదు లక్షలకుపైగా వ్యూస్, 30 వేలకుపైగా లైక్స్ రావడం గమనార్హం. పెద్ద సంఖ్యలో నెటిజన్లు రీట్వీట్ చేశారు కూడా.