ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 12న `ఎంత మంచివాడవురా`

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2019, 03:13 PM

సంక్రాంతి అంతకంతకు వేడెక్కుతోంది. కాలికి కత్తి కట్టి బరిలో దిగే పుంజుల సంఖ్య క్లియర్ కట్ గా తేలిపోతోంది. 2020 సంక్రాంతి బరిలో ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై ఇప్పటికే చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా నలుగురు అగ్ర కథానాయకుల సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటిస్తున్న అల వైకుంఠపురంలో చిత్రాలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ జనవరి 12న రిలీజవుతున్నాయి. సంక్రాంతి ముందు అసలు సిసలు వార్ జరగనుందని దీనిని బట్టి ఖాయమైంది. వీళ్లతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్.. విక్టరీ వెంకటేష్- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ మూవీ `వెంకీ మామ` కూడా సంక్రాంతి బరిలో ఫిక్సయిపోయాయి. ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. తాజాగా కళ్యాణరాముడు రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకుని వార్ లోకి దిగాడు. సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్నాం! అంటూ ఇంతకుముందు పోస్టర్ వేసినా అప్పటికి అధికారికంగా రిలీజ్ తేదీని ఖాయం చేయలేదు. తాజా పోస్టర్ లో రిలీజ్ తేదీ ప్రకటించేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మహేష్- బన్నిల సినిమాలతో వార్ లోకొచ్చేశారు. ఆ ఇద్దరితో పాటే.. కళ్యాణ్ రామ్ నటిస్తున్న `ఎంతమంచివాడవురా` చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా- శ్రీదేవి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న దసరా కానుకగా రిలీజైన టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. మంచోడు మంచోడు అంటుంటే కళ్యాణరాముడు మడతెట్టేస్తున్నాడు. దొరికినవాళ్లను దొరికినట్టే ఉతికేస్తున్నాడు. అతడి సన్నివేశం చూస్తుంటే సంక్రాంతి పుంజులతో గట్టిగానే పోటీపడేట్టున్నాడు. బహుశా మంచి కథ కంటెంట్ ఉంటే హిట్టు కొట్టొచ్చు అన్న ధీమాతోనే బరిలో దిగుతున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. 2017 సంక్రాంతికి ఖైదీనంబర్ 150తో పోటీపడుతూ శర్వానంద్ నటించిన శతమానం భవతి రిలీజైంది. ఆ సినిమాకి `ఎంతమంచివాడవురా` దర్శకుడు సతీష్ వేగేష్న కెప్టెన్సీ వహించారు. శతమానం భవతి ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే ధీమాతోనే ఈసారి కూడా వస్తున్నారని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa