ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టిన సునీల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2020, 03:01 PM

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదు ఇది. మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్న నటుడు ఈయనే.అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన చాన్సులు నిలబడక... కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఎందుకు అలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు. కానీ దానికి సాక్ష్యాలు లేవు. తప్పు ఎవరు చేసినా కూడా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు.


పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. ఈయన దూరమై 6 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఈయన గురించి సునీల్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఉదయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఈ కమెడియన్.ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సునీల్ కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో ఉన్నాడు. నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు సునీల్. ఆ సినిమాలో ఓ రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్‌లను తీసుకొచ్చాడు దర్శకుడు తేజ. వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్‌ను పరిగెత్తాలని కోరాడు. వాళ్లతో నిజంగానే పరిగెత్తి ఫస్ట్ వచ్చాడు ఉదయ్.. దాంతో సునీల్ వెళ్లి అంత స్పీడ్‌గా ఎలా పరిగెత్తావని ఉదయ్‌ని అడిగితే.. చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటు అయిపోయిందని సరదా సమాధానం చెప్పాడు. షూటింగ్‌లో అంత సరదాగా ఉండే మనిషి తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు సునీల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa