ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూచిపూడి నాట్య గురువు.. వెంపటి చినసత్యం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 09:07 PM

కృష్ణాజిల్లాలో శతాబ్దాలుగా కూచిపూడి నృత్య ప్రదర్శన కళని కాపాడుకొన్న సంప్రదాయం వెంపటివారిది. ఆ వారసత్వానికి చెందిన చలమయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1929 అక్టోబరు 15న వెంపటి చినసత్యం జన్మించారు. తన ఎనిమిదో యేట నుంచే లయబద్ధంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద నృత్యరీతులను ఔపోషన పట్టారు. కూచిపూడి నృత్యంలోని హొయలకు, అందాలకు చినసత్యం ముగ్ధుడయ్యారు. ఆ పరవశంలోంచి కూచిపూడి కళకి తనను తాను అంకితం చేసుకొన్నారు. అప్పట్లో మద్రాస్‌.. సాంస్కృతిక మక్కాగా పేరు పొందింది. కళలు, సాహిత్యం, సినిమాకు పట్టుకొమ్మగా విరాజిల్లింది. ఇలాంటి వాతావరణంలో తాడేపల్లి పేరయ్య శాస్త్రి వద్ద చినసత్యం శిష్యరికం చేశారు. అప్పటికే చినసత్యం బంధువు వెంపటి పెద సత్యం సినిమాల్లో నృత్య దర్శకుడిగా రాణిస్తున్నారు. పెదసత్యం వద్ద ఉంటూ కళా రహస్యాలూ, రీతులూ, మెళకువలను అధ్యయనం చేశారు.1963లో మద్రాసులో కూచిపూడి ఆర్ట్‌ అకాడమీని ప్రారంభించారు. తన జీవితకాలంలో 180 ఏకాంకిలు, 15 నృత్య నాటకాలను చినసత్యం కూర్చారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడ్డాయి. చినసత్యం కూర్చిన తొలి నృత్య రూపకం శ్రీకృష్ణ పారిజాతం. జానపదరీతిలో సాగే కూచిపూడికి చినసత్యం సిలబస్‌ రూపొందించారు. కూచిపూడి ప్రతిధ్వని పేరిట విదేశీ వేదికలపైకి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చేర్చారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సినిమాల్లో పనిచేశారు. బాలీవుడ్‌ నటి హేమమాలిని నటించిన రెండు తెలుగు సినిమాలకు నృత్య దర్శకత్వం అందించారు. కళకు ఇంతగా ప్రాణం పెట్టిన చినసత్యాన్ని కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. తాను పుట్టిన కూచిపూడి గ్రామాన్ని గ్లోబల్‌ తెర మీద నిలిపిన చినసత్యం 2012 జూలై 29న కన్నుమూశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa