ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో, విమర్శలతో కూడిన ట్వీట్లతో సంచలనంగా మారే ఆర్జీవీ తాజాగా భావోద్వేగంగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు ఏ అంశంపై మాట్లాడినా పూర్తి స్పష్టతతో స్పందించే వాడినని, కానీ తన జీవితంలో మొదటిసారి మాటలు కరవయ్యాయని వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదన్నారు. సినిమా చూస్తున్నంత సేపు తాను చిన్నపిల్లాడిలా మారిపోయానని పేర్కొన్నారు. గత 30 ఏళ్లలో ఏ సినిమా చూసినా ఇంతలా ఎంజాయ్ చేయలేదని, భారత చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం రాజమౌళి అని ప్రశంసించారు. ఇక ఎన్టీఆర్-రామ్‌చరణ్ పాత్రలపైనా వ్యాఖ్యానించారు. సినిమాలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని వస్తున్న కామెంట్లు పనికిమాలినవని, ఇద్దరూ అదరగొట్టేశారని చెప్పారు.