కన్నడ చిత్ర పరిశ్రమలో సహాయ పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హాస్యనటుడు మోహన్ జునేజా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన చివరిగా కేజీఎఫ్-2 చిత్రంలో నటించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి మరియు సంజయ్ దత్ నటించిన ఇటీవల విడుదలైన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2లో ఓ ముఖ్యమైన పాత్రను ఆయన పోషించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆ సినిమాలో ఆయన పాత్రకు విశేష స్పందన లభించింది. జునేజా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.