హీరోగా తొలి సినిమాలో నటించినప్పటికీ ఆపై కొన్ని సినిమాల్లో విలన్ వేషాలను పోషించాడు హీరో గోపీచంద్. జయం, నిజం, వర్షం వంటి సూపర్ హిట్ సినిమాల్లో గోపీచంద్ విలనిజానికి ప్రేక్షకులు నూటికి నూరు మార్కులు వేశారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా మరిన్ని విజయాలను అందుకున్న విషయం అందరికి తెలిసిందే.
గోపీచంద్ నటించిన కొత్త చిత్రం "పక్కా కమర్షియల్". మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా జంటగా నటించింది. జూలై 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈమేరకు ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న గోపీచంద్ తన కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఒక్కడులో ఐకానిక్ విలన్ ఓబుల్ రెడ్డి పాత్రను గోపీచంద్ పోషించాల్సిందట. ముందుగా ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ నే అనుకున్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక ఆయన కుదరదన్నారట. దీంతో ఒక్కడు దర్శకనిర్మాతలైన గుణశేఖర్, ఎమ్మెస్ రాజు ఇద్దరు కలిసి గోపీచంద్ ను కలిసి ఓబుల్ రెడ్డి పాత్రను పోషించవలసిందిగా కోరారట. అప్పటికి జయం సినిమాలో రఘు వంటి యువప్రతినాయకుడి వేషంలో నటించి ఫుల్ జోష్ మీదున్న గోపీచంద్ ఒక్కడు సినిమాను ఒప్పుకున్నారట. కానీ, ప్రకాష్ రాజ్ డేట్స్ సర్దుబాటు చేసుకుని ఒక్కడు సినిమాలో నటిస్తానని చెప్పడంతో దర్శకనిర్మాతలు ఆయన్నే ఖాయం చేసుకున్నారట. అలా హిస్టరీ క్రియేట్ చేసిన ఓబుల్ రెడ్డి పాత్ర గోపీచంద్ చేతుల వరకు వచ్చి చేజారిపోయింది. లేకపోతే, ఓబుల్ రెడ్డి వంటి ఐకానిక్ రోల్ గోపీచంద్ కెరీర్ లో ఒక మచ్చుతునకలా ఉండిపోయేది.