‘ఏ దునియా ఏ మహెఫిల్ మేరే కామ్ కీ నహీ..’ ‘సుహానీ రాత్ ఢల్ చుకీ.. నాజానే తుమ్ కబ్ ఆవోగీ..’ వంటి మధురుమైన పాటలు.. సుమధుర గానం వినగానే గుర్తుకు వచ్చే పేరు కీ.శే. మహ్మద్ రఫీ. బాలీవుడ్ ప్రముఖ పేర్లలో ఈయన పేరు వుంటుంది. తెలుగులో కూడా తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరించారు ఆ మహా గాయకుడు. ‘నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది’ వంటి ప్రజాదరణ పొందిన తెలుగు పాటలు పాడారు రఫీ. ఆయన గానానికి దేశంలోని అన్నీ భాషల్లో అభిమానులు వున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి 17 భాషల్లో ఆయన పాటలు పాడారు. ఇప్పటికీ ఆయన పాటలు రేడియోలో కమ్మగా పలకరిస్తాయి. 1950 నుంచి 1970 మధ్యకాలం మహ్మద్ రఫీ కాలం అని చెప్పొచ్చు. ఆయన లేకపోయినా ఆయన పాటలు అజరామరంగా నిలిచిపోతాయి.
రఫీకి ముందు, తరువాత ఎందరు గాయకులు ఉన్నా, వచ్చినా ఆయన గాత్రంలోని మాధుర్యం ఆకట్టుకున్న తీరేవేరు. ఆయన పాటకు ఫిదా కానివారు లేరు. అలాంటి మహా గాయకుడి పుట్టినరోజు నేడు. 24 డిసెంబర్ 1924లో పంజాబ్‌లోని కోట్లా సుల్తాన్ పూర్‌లో జన్మించారు ఆయన. 31 జూలై 1980 లో మరణించారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినిమాల్లో రఫీ గానం సాగిన తీరును మననం చేసుకుందాం. ఆయన తెలుగులో పాడిన సినిమాలు.. భక్త రామదాసు, భలే తమ్ముడు, తల్లాపెళ్ళామా, ఆరాధన, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, రామ్- రహీమ్, అక్బర్ సలీమ్ అనార్కలి వంటి చిత్రాల్లో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు మహ్మద్ రఫీ. ఆ అమర గాయకుడికి మనందరం చంద్రునికో నూలుపోగువలె ఓ నివాళి తప్ప ఏమివ్వగలం.