ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2018లో నిర్మాత‌ల ప్ర‌యాణం ఇలా

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 05:18 PM

‘కళాకారుల ప్ర‌తిభ రాణించాలంటే… రాజాశ్ర‌యం త‌ప్ప‌నిస‌రి’ అని పెద్ద‌లు చెబుతారు. అలాగే ఓ సినీ క‌ళాకారుడి ప్ర‌తిభ కూడా రాణించాలంటే అత‌నికో మంచి వేదిక కావాలి. అటువంటి వేదికను క‌ళాకారుల కోసం ఏర్పాటు చేసి… వారి క‌ళ‌ను ప్రేక్ష‌కుల‌కు, ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేవాడే నిర్మాత‌. ఒక సినిమా త‌యారు కావ‌డానికి కావ‌ల‌సిన బ‌డ్జెట్ ద‌గ్గ‌ర నుంచి… దాని నిర్మాణంతో పాటు… ఆ చిత్రానికి చేసే ప‌బ్లిసిటీ వర‌కు అహ‌ర్నిశ‌లు క‌ష్టప‌డి ప‌నిచేసే శ్రామికుడే నిర్మాత‌. మ‌రి… అటువంటి కొంద‌రి నిర్మాత‌ల ప్ర‌యాణం 2018లో ఎలా సాగిందో చెప్పే ప్ర‌య‌త్నమే ఈ ప్ర‌త్యేక క‌థ‌నం.


సి. అశ్వనీద‌త్: నిన్న‌టిత‌రం అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ ద‌గ్గ‌ర‌ నుంచి… వారి వార‌సుల‌ వ‌ర‌కు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌ను అందించిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. 2011లో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన ‘శ‌క్తి’ త‌రువాత‌ చిత్ర నిర్మాణానికి స్వ‌ల్ప విరామం ఇచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్… ఏడేళ్ళ విరామం అనంత‌రం 2018లో అల‌నాటి మేటిన‌టి సావిత్రి జీవితక‌థ ఆధారంగా ‘మ‌హాన‌టి’ బ‌యోపిక్‌ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. అంతేకాదు… ‘మ‌హాన‌టి’తో నిర్మాత‌గా బౌన్స్ బ్యాక్ అయిన ద‌త్‌… ఇదే ఏడాది నాగార్జున‌, నాని కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘దేవ‌దాస్‌’ని నిర్మించారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఓపెనింగ్స్‌నే రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం మహేష్ బాబు 25వ చిత్రం అయిన‌ ‘మ‌హ‌ర్షి’ని మ‌రో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజుతో క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ద‌త్. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్తానికి… 2018 అశ్వనీద‌త్‌ను మరోసారి `ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్‌`గా నిలబెట్టింది.
అల్లు అర‌వింద్:సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ రేటు ఎక్కువగా ఉన్న మ‌రో నిర్మాత అల్లు అర‌వింద్‌. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు ఈ మెగా ప్రొడ్యూస‌ర్‌. ‘ధృవ’(2016) త‌ర్వాత… ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘గీత గోవిందం’తో సంద‌డి చేసారు. చిన్న సినిమాగా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స్టార్ హీరోగా నిలబెట్టారు అర‌వింద్‌. కాగా… 2019 జ‌న‌వ‌రిలో అల్లు అర్జున్ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అలాగే… మహేష్ బాబు కెరీర్‌లో 27వ చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా చిత్రాన్ని నిర్మించ‌నున్నారట‌ అల్లు అర‌వింద్‌. అయితే… ఈ రెండు సినిమాల‌కి సంబంధించి అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంది.
దగ్గుబాటి సురేష్ బాబు:ప్రముఖ నిర్మాత, మూవీ మొఘ‌ల్ స్వర్గీయ డా.దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు డి.సురేష్ బాబు. 2017లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ నిర్మాత… 2018లో ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
అక్కినేని నాగార్జున:న‌్యూ టాలెంట్‌ని ప‌రిచ‌యం చేయ‌డంలో ముందుండే అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున‌. అలాగే కొత్త ద‌ర్శ‌కులను ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా… త‌న సొంత నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్‌పై కూడా కొంద‌రు నూత‌న‌ దర్శకులతో చిత్రాల‌ను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ హీరో కమ్ ప్రొడ్యూసర్. 2017లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘హ‌లో’ సినిమాల‌ను నిర్మించిన నాగ్‌… 2018లో శ్రీ రంజ‌నిని ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తూ… ‘రంగుల‌రాట్నం’ చిత్రాన్ని నిర్మించారు. 2018 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఆశించిన‌ విజ‌యాన్ని అందివ్వలేకపోయింది. అయితే… రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `చి ల సౌ`కి త‌న స‌హ‌కారం అందించి… ఆ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. అంతేకాదు… త‌న సంస్థ‌లోనే రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని చేయ‌బోతున్నారు నాగ్‌. దీంతో పాటు… క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’కు సీక్వెల్ చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ట ఈ టాలీవుడ్ కింగ్‌.
‘దిల్’ రాజు:టాలీవుడ్‌లో మోస్ట్‌ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్న నిర్మాత `దిల్` రాజు. `దిల్` రాజు ఓ సినిమా నిర్మిస్తున్నారంటే… ఇటు ప్రేక్ష‌కుల‌తో పాటు… అటు ఇండ‌స్ట్రీ కూడా మినిమం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతుంది. 2017లో వ‌రుస సినిమాల‌ను నిర్మించి డ‌బుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్న ‘దిల్’ రాజుకు… 2018 అనుకున్నంత స్థాయిలో క‌లిసిరాలేదు. ఈ సంవత్స‌రంలో విడుద‌లైన ‘ల‌వ‌ర్‌’ నిరాశ‌ప‌ర‌చ‌గా…. ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’, ‘హ‌లో గురు ప్రేమ‌కోస‌మే’ ఓ మోస్త‌రు విజ‌యం సాధించాయి. అయితే… 2019లో మాత్రం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌. ఆ చిత్రాలే వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్-2’, మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’. ఈ రెండు చిత్రాల‌తో ‘దిల్’ రాజు మ‌ళ్ళీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ట్రాక్ లోకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.
డివివి దానయ్య:ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా డివివి దానయ్య విజయ ప్రస్థానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2017 లో “నిన్నుకోరి” సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దానయ్య ఆ సక్సెస్ ను 2018లో ఇంకా ఘనంగా కొనసాగించారు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దానయ్య నిర్మించిన” భరత్ అనే నేను” సంచలన విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబు సినిమాల్లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక 2019 జనవరి 12 న విడుదల కానున్న” వినయ విధేయ రామ” తో హ్యాట్రిక్ సాధించనున్నారు దానయ్య. ఇక ప్రస్తుతం సంచలన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ కాంబినేషన్లో దానయ్య నిర్మిస్తున్న RRR నిర్మాణ విశేషాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి – ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో “మెగాస్టార్ 153” చిత్రాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు దానయ్య. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ చిత్రాల టాప్ గ్రేడ్ ప్రొడ్యూసర్ గా డివివి దానయ్య ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పరిటీలు అందరికీ ఆశ్చర్యాసూయలను కలిగిస్తున్నాయనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
కె.ఎస్‌.రామారావు:వైవిధ్య‌భ‌రితమైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన‌ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్. మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌గా ఛాలెంజింగ్ సినిమాల‌ను నిర్మిస్తూ… విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌ల సైతం అందుకున్నారు ఈ సంస్థ‌ అధినేత కె.ఎస్‌.రామారావు. 2015లో ‘మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు’ త‌ర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని… ‘తేజ్ ఐ ల‌వ్ యూ’ను నిర్మించారు. ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. కాగా… ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ, క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాను నిర్మించే ప‌నిలో ఉన్నారు ఈ అగ్ర నిర్మాత‌. 2019లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.
శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్:శ్రీ‌దేవి మూవీస్ ప‌తాకంపై ‘చిన్నోడు పెద్దోడు’ (1988), ‘ఆదిత్య 369’(1991), ‘వంశానికొక్క‌డు’ (1996) లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్. ఆ త‌ర్వాత విజ‌యం కోసం దాదాపు 20 ఏళ్ళు ఎదురుచూసిన ఈ నిర్మాత‌కు… 2016లో మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మ‌న్’తో అది వరించింది. అనంత‌రం మ‌ళ్ళీ రెండేళ్ళు గ్యాప్ తీసుకుని 2018లో మ‌రోసారి మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘స‌మ్మోహ‌నం’తో ప‌ల‌క‌రించారు. అంతేకాకుండా… ఈ సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.
బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్:‘ఛ‌త్ర‌ప‌తి’, ‘డార్లింగ్‌’, ‘అత్తారింటికి దారేది’, ‘నాన్న‌కు ప్రేమ‌తో’ లాంటి ఘ‌న విజ‌యాల‌ను అందించిన నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్. 2017 జీరో రిలీజ్ ఇయ‌ర్‌గా నిలిచిన ఈ నిర్మాతకు… 2018 మాత్రం ‘తొలిప్రేమ‌’ రూపంలో మంచి విజయాన్ని అందించింది. ఈ బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ ఇచ్చిన విజయోత్సాహంతో… ‘తొలిప్రేమ‌’ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలోనే మ‌రో సినిమాను నిర్మిస్తున్నారు ఈ అగ్ర నిర్మాత‌. ఆ చిత్ర‌మే అక్కినేని అఖిల్ హీరోగా న‌టిస్తున్న ‘Mr. మ‌జ్ను’. 2019 జ‌న‌వ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రంతో… ఈ అభిరుచి గ‌ల నిర్మాత‌ మరో భారీ విజయాన్ని తన‌ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
వంశీ కృష్ణ రెడ్డి, ప్ర‌మోద్:విజ‌య‌వంత‌మైన చిత్రాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే సంస్థ‌ల్లో యూవీ క్రియేష‌న్స్ ఒక‌టి. ఈ ప‌తాకంపై తెరకెక్కిన ‘మిర్చి’, ‘ర‌న్ రాజా ర‌న్’, ‘జిల్’, ‘భలే భ‌లే మ‌గాడివోయ్‌’, ‘ఎక్సెప్రెస్ రాజా’, ‘మ‌హానుభావుడు’ చిత్రాల‌తో భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత‌లు వంశీ కృష్ణ రెడ్డి, ప్ర‌మోద్. ఈ విజ‌యాల‌కు కొన‌సాగింపు అన్న‌ట్టుగా… 2018 జ‌న‌వ‌రిలో ‘భాగ‌మ‌తి’తో మ‌రో విజ‌యాన్ని అందుకున్నారు. అలాగే… `హ్యాపీ వెడ్డింగ్‌`, `టాక్సీవాలా`కు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2019 ఆగష్టు 15న‌ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, రవిశంక‌ర్ ఎల‌మంచిలి:‘శ్రీ‌మంతుడు’(2015), ‘జ‌న‌తా గ్యారేజ్’(2016) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత… ఈ ఏడాది ‘రంగ‌స్థ‌లం’ని నిర్మించి హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, రవిశంక‌ర్ ఎల‌మంచిలి. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీనే సృష్టించిన సినిమా… ఈ ఏటి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా త‌రువాత.. ఇదే సంస్థ నుంచి వ‌చ్చిన‌ ‘స‌వ్య‌సాచి’, ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని’ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘డియ‌ర్ కామ్రేడ్‌’… సాయిధ‌ర‌మ్ తేజ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ‘చిత్ర‌ల‌హ‌రి’ సినిమాలను నిర్మిస్తున్న ఈ త్ర‌యం… 2019లో విడుదలయ్యే ఈ చిత్రాల‌తో మ‌ళ్ళీ విజ‌యాల బాట ప‌డుతుందేమో చూడాలి.
సి.క‌ళ్యాణ్:2018లో తొలి విజ‌యాన్ని అందుకున్న నిర్మాత సి.క‌ళ్యాణ్‌. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సి.క‌ళ్యాణ్ నిర్మించిన ‘జై సింహా’… ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుద‌లై మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. అయితే… ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ‘ఇంటిలిజెంట్’ మాత్రం పరాజ‌యం పాలైంది. కాగా… 2019లో బాల‌కృష్ణ‌, వి.వి.వినాయక్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాను నిర్మించనున్నారు కళ్యాణ్. అయితే… ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ న్యూస్ ఇంకా రావల్సి ఉంది. మొత్తానికి 2018 ఈ నిర్మాత‌కు ఒక విజ‌యాన్ని, ఒక ప‌రాజ‌యాన్ని అందించింది.
ఎస్‌.రాధాకృష్ణ:‘స‌న్నాఫ్‌ స‌త్య‌మూర్తి’(2015), ‘అ ఆ’(2016) సినిమాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారు హ‌రికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ అధినేత ఎస్‌.రాధాకృష్ణ. ఏడాది గ్యాప్ అనంత‌రం…2018 ఆరంభంలో ఈ నిర్మాత నిర్మించిన ‘అజ్ఞాత‌వాసి’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయితే… ఇదే ఏడాది ఎన్టీఆర్‌తో ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ను నిర్మించి మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు ఈ నిర్మాత‌. మొత్త‌మ్మీద ఈ నిర్మాత కూడా ఒక పరాజ‌యం, ఒక విజ‌యంతో 2018ని ముగించారు.
శ్రీ‌ధ‌ర్ ల‌గ‌డ‌పాటి, శిరీషా ల‌గ‌డ‌పాటి:నిర్మాత‌లుగా కెరీర్ ఆరంభంలో ‘ఎవ‌డిగోల వాడిది’, ‘స్టైల్’ చిత్రాల‌తో ఆడియ‌న్స్‌ని అల‌రించి విజయాలను సొంతం చేసుకున్న ఈ నిర్మాత‌లు… గ‌త కొంత కాలంగా స‌క్సెస్‌కు దూర‌మైపోయారు. అయితే… ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం… బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది.
న‌ల్ల‌మ‌లుపు శ్రీ‌నివాస్ (బుజ్జి):‘ల‌క్ష్మీ’, ‘ల‌క్ష్యం’, ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌ను నిర్మించిన నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీ‌నివాస్. అయితే… ‘రేసుగుర్రం’ త‌ర్వాత త‌న పంథాను మార్చుకున్నారు శ్రీ‌నివాస్‌. పూర్తి త‌ర‌హా నిర్మాతగా కొంత గ్యాప్ ఇచ్చి… సంయుక్తంగా సినిమాల‌ను నిర్మించ‌డం మొద‌లుపెట్టారు శ్రీ‌నివాస్. అందులో భాగంగానే… ప్ర‌ముఖ నిర్మాత‌లు బెల్లంకొండ సురేష్‌, ‘ఠాగూర్’ మ‌ధుతో క‌లిసి కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే… అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక‌పోయాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది మరో నిర్మాత వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌తో క‌లిసి ‘ట‌చ్ చేసి చూడు’ చిత్రాన్ని నిర్మించారు. అయితే… ఈ సినిమాతోనూ మ‌రోసారి నిరాశే ఎదురయ్యింది.
జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌):జ‌యాప‌జయాల‌కు అతీతంగా… వైవిధ్య‌భ‌రితమైన‌ చిత్రాల నిర్మాణానికి చిరునామాగా నిలిచే సంస్థ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) హోం ప్రొడక్ష‌న్ అయిన ఈ సంస్థ‌లో… ‘గమ్యం’, ‘కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌’, ‘కంచె’, ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ వంటి చిత్రాలు నిర్మితమయ్యాయి. వీటిలో ‘కంచె’ సినిమాకు గాను నేష‌న‌ల్ అవార్డును కూడా కైవ‌సం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది స్పేస్ థ్రిల్లర్ ‘అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌.’ను నిర్మించారు క్రిష్‌. ఫ‌లితం మాట ప‌క్క‌న పెడితే… ఇటువంటి స‌బ్జెక్ట్‌తో సినిమాని నిర్మించిన ఈ నిర్మాత‌కు హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం.
పరుచూరి విజ‌య ప్ర‌వీణ‌:తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ… ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ అనే చిన్న సినిమాను నిర్మించారు పరుచూరి విజ‌య ప్ర‌వీణ‌. నిర్మించ‌డ‌మే కాకుండా సినిమాలో న‌టించి ఇటు న‌టిగా… అటు నిర్మాత‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నారు. అంతేకాకుండా… తొలి చిత్రంతోనే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూస‌ర్‌ అనిపించుకున్నారు. మ‌రి ఇటువంటి విభిన్న‌మైన చిత్రాలు భ‌విష్య‌త్తులో కూడా ఈమె నుంచి వ‌స్తాయేమో చూడాలి. కాగా… ఈ సినిమా విడుద‌ల విష‌యంలో న‌టుడు రానా కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అత‌ని బ్రాండ్ వాల్యూతో ఈ సినిమా జ‌నాల్లోకి బాగా చేరువ‌య్యింది.
మంచు మోహ‌న్‌బాబు:శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించి అల‌రించారు న‌టుడు, నిర్మాత మోహ‌న్‌బాబు. అయితే… గ‌త కొంత‌కాలంగా నిర్మాణాల‌కు దూరంగా ఉన్న ఈ విల‌క్ష‌ణ న‌టుడు… 2018లో ‘గాయ‌త్రి’తో మరోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అయితే… మోహ‌న్‌బాబు ద్విపాత్రాభిన‌యం… శ్రియ, విష్ణు పెర్ఫార్మన్స్ సినిమాకి ప్ల‌స్ అయినా… అవి సినిమాని విజ‌యతీరాలకు చేర్చలేకపోయాయి.
కాగా… మోహ‌న్‌బాబు బాట‌లోనే ఈ త‌రం యువ క‌థానాయ‌కులు కొంత‌మంది 2018లో నిర్మాత‌లుగా మారి విజ‌యాల‌ను అందుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…
నాగ‌శౌర్య‌: యువ క‌థానాయ‌కుడు నాగ శౌర్య హోం బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌. ఈ ప‌తాకంపై నాగ శౌర్య త‌ల్లి ఉషా మ‌ల్పూరి నిర్మాతగా నిర్మించిన‌ తొలి చిత్రం ‘ఛ‌లో’. గ‌త కొంత కాలంగా విజ‌యం కోసం ఎదురు చూస్తూన్న ఈ యంగ్ హీరో… సొంత సంస్థ నిర్మించిన తొలిచిత్ర‌మైన‌ ‘ఛ‌లో’తోనే కెరీర్ బెస్ట్‌ను అందుకున్నారు. అయితే… ఇదే బ్యాన‌ర్‌పై నిర్మించిన మ‌లి చిత్రం ‘@న‌ర్త‌న‌శాల’ మాత్రం ‘ఛ‌లో’ మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌లేక‌పోయింది.
నాని:నిర్మాత‌గా మారిన మ‌రో క‌థానాయ‌కుడు నాని. త‌న బ్యాన‌ర్‌లో మొద‌టి సినిమానే ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా నిర్మించి… అ! అంటూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందారు. త‌న స్నేహితురాలు ప్ర‌శాంతి త్రిపిర్నేనితో క‌లిసి ప్రారంభించిన ఈ సంస్థ‌పై డెబ్యూ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘అ!’ చిత్రాన్ని నిర్మించారు. మిశ్ర‌మ స్పంద‌న ల‌భించినా… నిర్మాత‌గా నానికి మాత్రం మంచి పేరును తీసుకువ‌చ్చిందీ చిత్రం.
కార్తికేయ: ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో ప‌రిచ‌య‌మైనా… ‘RX 100’తో యూత్‌కు బాగా ద‌గ్గ‌రైన వ‌ర్థ‌మాన న‌టుడు కార్తికేయ‌. కార్తికేయ హోం బ్యాన‌రైన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన ఈ సినిమా… అటు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తితో పాటు… ఇటు నిర్మాతకు కూడా ఘ‌న విజ‌యాన్ని అందించింది.
సుధీర్ బాబు: కథానాయకుడి నుంచి నిర్మాత అవతారం ఎత్తిన మరో యువ నటుడు సుధీర్ బాబు. ఈ ఏడాది ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో నిర్మాతగా కూడా మారారాయ‌న‌. అలాగే… ఈ ఫీల్ గుడ్ మూవీతో పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు.
ఏదేమైనా… ప్ర‌తీ ఏడాదిలాగే 2018 కూడా ప‌లువురు నిర్మాత‌ల‌కు మిశ్ర‌మ ఫ‌లితాల‌ను అందించిన‌ ఏడాదిగా నిల‌చింద‌నే చెప్పాలి. మ‌రి… 2019 అయినా అంద‌రికీ విజ‌యాన్ని అందించే సంవ‌త్స‌రంగా నిల‌వాల‌ని ఆకాంక్షిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa