సూపర్ స్టార్ కృష్ణగారు ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చీకటి అలుముకుంది. ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రిని పోగొట్టుకుని తీవ్ర శోకంలో మునిగిపోయిన మహేష్ బాబుకు ఈ కష్టకాలంలో దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.
పోతే, కృష్ణగారు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ...ఇలా ఎన్నో బాధ్యతలను గొప్పగా నిర్వర్తించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సూపర్ స్టార్ గా చెరగని ముద్రవేశారు.
తెలుగు సినీ పరిశ్రమకు కొత్త సాంకేతికతను పరిచయం చేసిన గొప్పతనం కృష్ణగారికే దక్కుతుంది. ఫస్ట్ సినిస్కోప్ ఫిలిం, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ ఫిలిం, ఫస్ట్ 70mm ఫిలిం, ఫస్ట్ DTS ఫిలిం, ఫస్ట్ కౌ బాయ్ జానర్ ఫిలిం... ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణగారు సినీ సాంకేతికత విషయంలో అప్పటి హీరోలు, దర్శక నిర్మాతలకన్నా ఒకడుగు ముందే ఉన్నారు.