సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట’ను తెలుగులో రిలీజ్ చేస్తున్న వల్లభనేని అశోక్.. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. అల్లు అరవింద్.. దిల్ రాజు.. యువి క్రియేషన్స్ అధినేతల పేర్లు ప్రస్తావిస్తూ వారు తనకు థియేటర్లు దక్కకుండా అడ్డు పడుతున్నారని అశోక్ ఆరోపించాడు.
ముందు వీరి పేర్లు ప్రస్తావించి మామూలుగానే తన ఆవేదన వెళ్లగక్కిన అశోక్.. తర్వాత సంయమనం కోల్పోయాడు. ఈ కుక్కల్ని కాల్చి పారేయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్లు కచ్చితంగా అభ్యంతరకరమే. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. అశోక్ మీద చర్యలు చేపడతారని కూడా వార్తలొస్తున్నాయి.
ఆ సంగతలా వదిలేస్తే.. అశోక్ ఆక్రోశం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో థియేటర్ల మాఫియా గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్, ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు థియేటర్లను గుప్పెట్లో పెట్టుకున్నారని.. చిన్న సినిమాలకు థియేటర్లు ఇచ్చే విషయంలో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ముందు నుంచి ఉన్నవే. ఐతే ‘పేట’ విషయంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చించాల్సిన విషయం.
రెండు వారాల ముందు వరకు ‘పేట’ తెలుగు వెర్షన్ సంక్రాంతికి వస్తుందన్న సమచారామే. లేదు. తమిళంలో కూడా నెల రోజుల కిందటే రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. తెలుగు డీల్ చాలా ఆలస్యంగా జరిగింది. మరోవైపు సంక్రాంతికి షెడ్యూల్ అయిన మూడు తెలుగు సినిమాలు నాలుగు నెలల కిందటే రిలీజ్ కన్ఫమ్ చేసుకున్నాయి.
థియేటర్ల బుకింగ్స్ కూడా కొన్ని నెలల కిందటే పూర్తయ్యాయి. అశోక్ హడావుడిగా డబ్బింగ్ పనులు మొదలుపెట్టి థియేటర్ల కోసం వచ్చాడు. మరి ఆల్రెడీ డీల్ పూర్తయిన థియేటర్లను తీసి అతడికెలా ఇస్తారన్నది ప్రశ్న. లేటుగా రేసులోకి వచ్చి.. థియేటర్లు ఇవ్వట్లేదని బూతులు తిట్టడం ఎంత వరకు సమంజసం అంటున్నారు. మరి దీనికి అశోక్ ఏం సమాధానం చెబుతాడు?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa