టాలీవుడ్ ను విషాదం వెంటాడుతుంది. గతేడాది సీనియర్ లెజెండరీ నటులు రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, చలపతి రావు గారు..ఇలా వరసగా నాలుగు నెలల వ్యవధిలో కన్ను మూసి, టాలీవుడ్ లో శూన్యం ఏర్పరిచారు. కొత్త ఏడాదిలో కూడా యువనటుడు సుధీర్ వర్మ ఆకస్మిక మరణం చెంది, టాలీవుడ్ ని షాక్ కు గురి చెయ్యగా, ఇప్పుడు సీనియర్ నటి జమున గారు మనందరికీ దూరమవుతూ, మరోసారి టాలీవుడ్ లో విషాదాన్ని నింపారు.
86ఏళ్ళ వయసులో హైదరాబాద్ లోని తన స్వగృహంలో జమున గారు తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగానే జమున గారు కాలం చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయం పదకొండు గంటల సమయంలో జమునగారి పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్ కు తీసుకురానున్నారు.
తెలుగుతో పాటుగా తమిళం, కన్నడం, హిందీ చిత్రాలలో నటించిన జమునగారు పవర్ఫుల్ రోల్స్ కు పెట్టింది పేరు. నటిగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా రాజకీయసేవ కూడా ఆమె చేసారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభకు ఆమె ఎంపికయ్యారు.