కాకినాడ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం , జీ. మేడపాడు మధ్యన ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ అనే ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది చనిపోయినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు పేలుడు ధాటికి మృతదేహాలు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు, కాళ్లు, చేతులూ పంటపొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో 20 మంది వరకూ బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు సమాచారం. ఉదయం పని కోసం వెళ్లినవారు.. ఇలా విగత జీవులుగా పొలాలలో పడి ఉండటం చూసి వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఐదు కిలోమీటర్ల దూరం వినిపించిన శబ్ధం
పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. శబ్దం తీవ్రతకు పక్కనే ఉన్న గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.
సీఎం చంద్రబాబు స్పందన
మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. మరోవైపు కాకినాడ జిల్లా కలెక్టర్‌తో హోం మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa