హత్య కేసులో తమకు యావజ్జీవిత శిక్ష విధించిన న్యాయమూర్తిని చంపుతామంటూ దోషులు బెదిరింపులకు దిగిన సంఘటన కలకలం రేపుతోంది. ‘‘నిన్ను చంపుతాం.. నువ్వు ఎక్కడ ఉంటావో మాకు తెలుసు’’ అంటూ హత్య కేసు దోషులు జడ్జిని బెదిరించిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌లో చోటుచేసుకుంది. 2024 నాటి ఓ హత్య కేసులో బిజ్‌నోర్ అడిషినల్ అండ్ సెషన్స్ జడ్జి గురువారం తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను దోషులుగా నిర్దారించి యావజ్జీవిత ఖైదు విధించారు. ఈ క్రమంలోనే ఆయనను చంపుతామని బెదిరించారు.
గురువారం మధ్యాహ్నం తీర్పు తర్వాత, దోషులు జైదీప్ సింగ్ (35), పింటు చౌహాన్ (30) కోర్టు హాలులోనే న్యాయమూర్తిని బెదిరించారు. అంతేకాదు, తాము హత్య చేసిన వ్యక్తి కుమార్తెను కూడా వదిలిపెట్టబోమని శపథం చేశారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు సింగ్, చౌహాన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణానికి దారితీయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీనియర్ పోలీసు అధికారులు భారీ భద్రత మధ్య న్యాయమూర్తిని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. రక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బందిని కూడా ఆయన నివాసం వద్ద మోహరించారు.
బిజ్‌నోర్ జిల్లా మతూరా దుర్గ గ్రామానికి చెందిన పుఖరాజ్ సింగ్ (55)ను వరకట్న వివాదం విషయంలో జయదీప్ సింగ్, పింటూ చౌహన్‌లు హత్య చేశారు. జయదీప్ సోదరుడు ప్రదీప్ సింగ్‌తో పుఖరాజ్ కుమార్తెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అత్తింటివాళ్లు కారు, అదనపు కట్నం కోసం ఆమెను వేధించారు. దీంతో ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. ఈ కేసు నడుస్తుండగా.. పుఖరాజ్ సింగ్‌ను జయదీప్ సింగ్, పింటూ చౌహన్‌లు మే 2024లో కారుతో ఢీకొట్టి దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుకాగా.. దర్యాప్తులో జయదీప్, పింటూలు హత్య చేసినట్టు నిర్దారణ అయ్యింది. దీంతో హత్య కేసులో దోషులుగా నిర్దారించిన న్యాయమూర్తి.. వారికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa