పాలకొల్లు నుంచి మద్రాసుకు దాసరి పయనం ఎంతో ఆసక్తికరమైనది... ఎంతో ఉద్విగ్నమైనది. కాలికి చెప్పులు అయినా లేని స్థితిలో ఆయన సినిమాపై పిచ్చి ప్రేమతో మద్రాసు పయనమై అక్కడ పరిశ్రమలో కెరీర్ని వెతుక్కుని ఇంతింతై అన్న చందంగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ దాసరి నారాయణరావు. నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాత గా బముముఖ ప్రజ్ఞతో ఎదిగారు. ఒడిదుడుకుల్ని ఎదిరించిన దర్శకధీరుడు అతడు. హైదరాబాద్ ఇండస్ట్రీ కర్తల్లో ఒకరిగా నిలిచారు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ కెక్కారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. 250 పైగా చిత్రాలలో రచయిత (సంభాషణలు - గీతరచయిత)గా పనిచేశారు. తెలుగు - తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి - తన నటనకుగాను ప్రతిష్ఠాత్మక పురస్కారాలెన్నో గెలుచుకున్నారు.
కాలేజ్ లో చదివేరోజులలో దాసరి బిఏ అనిపించుకున్న ఆయన.. అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా - నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ కి కొత్త కళాకారులను పరిచయం చేసి టాప్ స్టార్లు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18000 కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. ఇది తెలుగువారిలో దాసరి ఇమేజ్ కి అద్దం వంటిది. తాతా మనవడు - స్వర్గం నరకం - మేఘసందేశం - మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా సినిమాలు తీశారు. బొబ్బిలి పులి - సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు - సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నారు.
ఇలాంటి అసాధారణ చరిత్ర ఉన్న వ్యక్తి గనుకే దాసరి అంటే తెలుగు ప్రజలు ఎంతో ఎమోషన్ అవుతారు. ఒక గొప్ప చరిత్రకు ఆయన నాంది పలికారు. టాలీవుడ్ భవిష్యత్ కి బాటలు వేసిన ఘనుడాయన. 4 మే 1942లో పాలకొల్లులో జన్మించిన ఆయన 30మే 2017 (వయసు 75) లో స్వర్గస్తులయ్యారు. ఆయన శిష్యుల్లో మంచు మోహన్ బాబు - మెగాస్టార్ చిరంజీవి - సి.కళ్యాణ్ - రేలంగి నరసింహారావు - జర్నలిస్టు ప్రభు వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సినీపరిశ్రమలో అన్ని శాఖల్లోనూ ఆయన శిష్యులు ఉన్నారు. ఆయనని అపరిమితంగా గౌరవించే - ప్రేమించే కార్మికులు ఉన్నారు. ఆయన నిర్యాణం ఇప్పటికీ జీర్ణించుకోలేనిది. ఇదివరకూ ఫిలింనగర్ లో దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా 26 జనవరి 2019న పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ బాబు - మురళి మోహన్ వంటి ప్రముఖులు అన్నీ తామే అయ్యి నడిపించారు. అయితే ఈ ఈవెంట్ లో మెగా - అల్లు కాంపౌండ్ మిస్సవ్వడంపై దాసరి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది. దాసరికి మెగాస్టార్ చిరంజీవి - అల్లు అరవింద్ వంటివారు ఎంతో సన్నిహితులే. దాసరి ఆస్పత్రిలో ఉన్న చివరి రోజుల్లో ఆయన్ని పరామర్శించారు. చిన్న పాటి కలతలు ఉన్నా అన్నీ మర్చిపోయి కలిసిపోయారు. కానీ ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనలేకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `సైరా- నరసింహారెడ్డి` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa