భారతదేశపు ఆత్మను నిజంగా అనుభవించాలంటే వారణాసి (Varanasi) తప్పక చూడాలి. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీ (Kashi) ఆధ్యాత్మికత, మనశ్శాంతి కోసం అద్భుతమైన గమ్యస్థానం. మీరు దగ్గరలో కేవలం ఒక్క రోజే ఉన్నా, ఆ ఒక్క రోజులోనే కాశీలోని వైభవాన్ని ఆస్వాదించవచ్చు. ఉదయం లేచి రాత్రి వరకు మీ ‘వారణాసీ టూర్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడండి.సూర్యుడు ఉదయించేముందే, దశాశ్వమేధ్ (Dashashwamedh) లేదా అస్సీ ఘాట్ (Assi Ghat) వద్ద చిన్న పడవలో బోట్ రైడ్ చేయడం మంచి ప్రారంభం. గంగా నదిపై ఉదయపు సౌందర్యాన్ని చూసి, ఆకాశం బంగారు రంగులో మారడం, పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల స్నానాలను గమనించడం మనసుకి సాంత్వన ఇస్తుంది. ఘాట్ ఒడ్డున వేడి వేడి ‘చాయ్’ను ఆస్వాదించడమూ, సిటీ నిద్రలేవడం గమనించడం మరీ ప్రత్యేక అనుభవం. బోట్ రైడ్ తర్వాత నడక ద్వారా కాశీ విశ్వనాధుని దర్శనం పొందవచ్చు. గుడి పరిసరాల్లో పూల సువాసనలు, అగరబత్తుల ఘుమఘుమలు, షాపుల సందడి మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి.మధ్యాహ్నం సమయంలో, వారణాసీ స్ట్రీట్ ఫుడ్ రుచులను ఆస్వాదించవచ్చు. ‘కచోరీ గల్లీ’లో ఆలూ కర్రీతో స్పైసీ కచోరీ, టమాటర్ చాట్ తప్పక తినండి. ‘బ్లూ లస్సీ షాప్’లో క్రీమీ లస్సీని మిస్ కాకుండా ట్రై చేయండి. చలికాలంలో వెళ్తే ‘మలయ్యో (Malaiyyo)’ అనే ప్రత్యేక స్వీట్ కూడా చూడవలసి ఉంటుంది. తిన్న వెంటనే సారనాథ్ బయలుదేరి, బుద్ధుడు తన మొదటి బోధన ఇచ్చిన ధమేక్ స్థూపం, మ్యూజియం చూడవచ్చు. తిరిగి సిటీకి చేరి ప్రసిద్ధ బనారసీ పట్టు చీరల తయారీని చూడటం లేదా షాపింగ్ చేయడం కూడా ఒక అదనపు అనుభవం.సాయంత్రం గంగా హారతి చూడడం తప్పనిసరిగా ఉండాలి. దశాశ్వమేధ్ ఘాట్ చేరి, పడవలో కూర్చుని హారతీ వేడుకను వీక్షించవచ్చు. పండితులు పెద్ద దీపాలతో చేసే హారతి, గంటల శబ్దాలు, మంత్రాలు రోమాలను కదిలిస్తాయి. ఆ వెలుగులు నదిలో ప్రతిబింబించడం అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. రాత్రికి లోకల్ రెస్టారెంట్‌లో నార్త్ ఇండియన్ థాలీ తినడం, ప్రసిద్ధ ‘బనారసీ పాన్’తో డిన్నర్ ముగించడం, ఆ తర్వాత జనం తగ్గాక ఘాట్ల వెంబడి నడవడం, నది అలల శబ్దాన్ని వినిపించడం అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.వారణాసికి వెళ్లడానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో ప్లాన్ చేయడం మంచిది. వాతావరణం చల్లగా, సౌకర్యంగా ఉంటుంది. ఏప్రిల్–జూన్ మధ్య ఎండలు ఎక్కువ కాబట్టి ఆ సమయంలో వెళ్లకూడదు. దేవ్ దీపావళి (నవంబర్) లేదా మహా శివరాత్రి (ఫిబ్రవరి) సమయంలో వెళ్ళితే కాశీ వైభవాన్ని మరింత ప్రత్యేకంగా అనుభవించవచ్చు.వారణాసికి ఫ్లైట్, రైలు కనెక్టివిటీ బాగుంది. ‘లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్ట్’ సిటీకి 30 కి.మీ దూరంలో ఉంది, దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైళ్లు లభిస్తాయి. సిటీ లోపల తిరగడానికి ఆటో, సైకిల్ రిక్షాలు ఉత్తమం. పాత బస్తీలలో నడక చేయడం సులభమైన మార్గం. ఆన్‌లైన్ పేమెంట్స్, మొబైల్ సిగ్నల్స్ కోసం టెన్షన్ అవసరం లేదు.ఖర్చు మీ ప్లానింగ్‌పై ఆధారపడి మారుతుంది. తక్కువ బడ్జెట్ (Budget Traveller) కోసం సుమారు రూ.1,500–2,000 సరిపోతుంది (సింపుల్ ఫుడ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షేరింగ్ బోట్). కొంచెం సౌకర్యంగా, ప్రైవేట్ ఆటో/బోట్‌లో తిరగాలంటే రూ.3,000–5,000 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో హోటల్ రూమ్స్, పట్టు చీరల షాపింగ్ ఖర్చులు లెక్కించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa