ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాచీకార్డియా అంటే ఏంటి? గమనించాల్సిన లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 10:44 PM

టాచీకార్డియా అనేది గుండెకి సంబంధించిన సాధారణ వైద్య పరిస్థితి. సాధారణ హృదయ స్పందన రేటు నిమిషానికి 60 నుంచి 100 బీట్ల మధ్య ఉంటుంది. అయితే, హృదయ స్పందన రేటు 100 దాటినప్పుడు, అది ప్రమాదకరం కావచ్చు. ఈ పరిస్థితిని టాచీకార్డియా అంటారు. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మీ హార్ట్ బీట్స్ 100 కంటే ఎక్కువగా ఉంటే అది టాచీకార్డియా కావచ్చు.


తరచుగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల.. దానికి రక్తాన్ని పంప్ చేయడానికి సరైన టైమ్ లభించదు. మీ బాడీలోని కణాలకు, భాగాలకు రక్తం, ఆక్సిజన్‌‌ను గుండె సరిగ్గా పంప్ చేయకపోతే ఆ పరిస్థితి తీవ్రం కావచ్చని క్లీవ్‌ల్యాండ్‌క్లినిక్ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం అసలు టాచీకార్డియా అంటే ఏంటి, గమనించాల్సిన లక్షణాలు, కారణాలు, వైద్య పరిస్థితి ఇలా ప్రతి దాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అసలు టాచీకార్డియా అంటే ఏంటి?


అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రకారం టాచీకార్డియా అనేది తీవ్రమైన గుండె సమస్య. ఇది ఉన్నవారిలో గుండె నిమిషానికి 100 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. టాచీకార్డియా వంటి వ్యాధి ప్రారంభంలో ఎటువంటి సమస్య ఎదురుకాదు. కానీ కాలక్రమేణా అది అధిక రక్తపోటు, గుండె ఆగిపోవడం, స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు. అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రకారం కొన్నిసార్లు టాచీకార్డియాలో వేగవంతమైన హృదయ స్పందన కారణంగా మెదడు రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది.


టాచీకార్డియా రకాలు, వివరాలు


మాస్ జనరల్ బ్రిగమ్ ప్రకారం టాచీకార్డియా మూడు రకాలు‌గా విభజించబడింది. అవి ఏంటంటే..


సైనస్ టాచీకార్డియా : ఇది సాధారణ స్పందన. ఈ పరిస్థితిలో వ్యాయామం తీవ్రంగా చేయడం, ఒత్తిడి, ఆందోళన, జ్వరం, ఏదైనా వ్యాధులకు మెడిసిన్ తీసుకోవడం వంటి కారణాల వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది.


సుప్రా వెంట్రిక్యులర్ టాచీకార్డియా (SVT): ఇది గుండె పై గదుల్లో (కర్ణిక) వచ్చే పరిస్థితి. ఇందులో ఏట్రియల్ ఫ్లట్టర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వంటివి ఉన్నాయి.


వెంట్రిక్యులర్ టాచీకార్డియా : ఇది సాధారణంగా గుండె కింది గదుల్లో మొదలవుతుంది. ఈ పరిస్థితిలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి హార్ట్ బీట్ నిమిషానికి 200 BPM వరకు ఉండొచ్చు. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.


టాచీకార్డియా లక్షణాలు ఏంటి?


క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం టాచీకార్డియా ఉన్న కొంతమందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. ఇంకొందరికి తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. టాచీకార్డియా లక్షణాల్లో కొన్ని గమనించవచ్చని నివేదిక చెబుతుంది. అవి ఏంటంటే


వేగవంతమైన హృదయ స్పందన రేటు


శ్వాస ఆడకపోవడం


ఛాతీ నొప్పి


గుండె దడ


తల తిరగడం


వివరించలేని అలసట, బలహీనత


కొన్ని సందర్భాల్లో మూర్చపోవడం


వికారం


ఆందోళన


టాచీకార్డియాకు కారణాలేంటి?


టాచీకార్డియా రావడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఎక్కువగా ఆలోచించే, ఒత్తిడికి గురయ్యే వారికి ఈ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా కెఫిన్, ఆల్కహాల్, పొగాకు తీసుకునేవారిలో కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, చికిత్స చేయని థైరాయిడ్ సమస్య, యాంటీఅర్రిథమిక్స్, యాంటీడ్రిపెసెంట్స్ వంటి కొన్ని రకాల మందులు. సాధారణంగా గమనించాల్సిన కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే..


ఒత్తిడి


డీహైడ్రేషన్


అధిక రక్తపోటు


కరోనరీ ఆర్టరీ వ్యాధి


గుండె జబ్బులు


రక్తంలో తక్కువ షుగర్ లెవల్స్


ప్రెగ్నెన్సీ


రక్తహీనత


టాచీకార్డియా వల్ల కలిగే పరిస్థితులేంటి? ఎలా నిర్థారించాలి?


టాచీకార్డియాను సకాలంలో గుర్తించకపోతే మూత్రపిండాలు, లివర్, గుండె వంటి కీలక అవయవాలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. టాచీకార్డియా అనేది రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండెపోటు, కార్డియోమయోపతి, గుండెపోటు వంటి పరిస్థితులకు దారితీయవచ్చు. మీకు పైన చెప్పిన లక్షణాలు తరచుగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.


వారు మీ వైద్య చరిత్ర ఆధారంగా కొన్ని పరీక్షల్ని సిఫార్స్ చేయవచ్చు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, హోల్టర్ మానిటర్, టిల్ట్ టేబుల్ పరీక్ష, EP అధ్యయనం, ఎకోకార్డియోగ్రామ్, బ్లడ్ టెస్టులు, కార్డియాక్ ఇమేజింగ్ వంటి పరీక్షల్ని సూచించవచ్చు.


ప్రెగ్నెన్సీ సమయంలో టాచీకార్డియా


అభివృద్ధి చెందుతున్న శిశువుకు సరైన మొత్తంలో పోషకాహారం, ఆక్సిజన్‌ను అందించడానికి గుండె మరింత కష్టపడి పనిచేయాలి. కొన్నిసార్లు, అంతర్లీన వైద్య పరిస్థితులు కూడా హృదయ స్పందన పెరుగుదలకు కారణమవుతాయి. పెరిగిన హృదయ స్పందన సాధారణమే, కానీ దానిని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భధారణ సమయంలో హృదయ స్పందనలో మార్పులకు కారణాలు ఏంటంటే..


వేగవంతమైన రక్త ప్రసరణ


గర్భాశయం యొక్క పరిమాణంలో మార్పులు


రొమ్ము పరిమాణంలో మార్పులు


వ్యాయామం చేయడం వల్ల కలిగే నష్టాలు


టీ, కాఫీతో పాటు కెఫిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం


గర్భధారణ సమయంలో టాచీకార్డియాను ఎలా నివారించాలి?


గర్భధారణ సమయంలో హృదయ స్పందన రేటు పెరగకుండా నిరోధించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.


ఒత్తిడిని నివారించండి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి భాగం చేసుకోండి.


రాత్రి 8 గంటలు నిద్రపోండి. పగటిపూట కూడా విశ్రాంతి తీసుకోండి.


హైడ్రేషన్ ముఖ్యం. పుష్కలంగా నీరు తాగాలి.


ఏదైనా సమస్య ఉంటే మీ వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?


అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెకి మంచి పరిస్థితులు కావు. అందుకే ఈ పరిస్థితుల్ని సరిగ్గా నిర్వహించండి.


మందులు ఎలా పడితే అలా తీసుకోకండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వైద్యుణ్ని సంప్రదించి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మెడిసిన్ వాడండి.


కెఫీన్, ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ఇవి మెదడుపై ప్రభావాన్ని చూపిస్తాయి.


పొగాకు ఉత్పత్తుల్ని తీసుకోవడం మానేయండి.


సమతుల్య ఆహారం గుండెకి మేలు చేస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.


ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యల్ని తీసుకువస్తుంది. ఒత్తిడిని నిర్వహించడానికి యోగా, ధ్యానం లేదా వ్యాయామం రెగ్యులర్‌గా చేయండి.


లక్షణాలు తరచుగా కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స పొందండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa