ఫాస్టాగ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశంలో తొలి బ్యారియర్-ఫ్రీ టోల్ గేట్ అందుబాటులోకి వచ్చింది. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ వ్యవస్థను ప్రారంభించడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు.సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద కనిపించే బారియర్లు ఇకపై ఉండవు. వాహనదారులు నేరుగా గేట్ దాటిపోవచ్చు. అయినప్పటికీ, ఫాస్టాగ్ వాలెట్ నుంచి టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి Nitin Gadkari సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు.గుజరాత్‌లోని NH-48పై ఈ సిస్టమ్‌ను ప్రారంభించారు. సూరత్–భరూచ్ సెక్షన్‌లోని చోరయాసి టోల్ ప్లాజా వద్ద దేశంలోనే తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బారియర్-లెస్ టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. వాహనాలు ఆగకుండా టోల్ చెల్లింపులు జరగడం దీని ప్రత్యేకత. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీని వినియోగించారు.ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్‌గా పనిచేస్తుంది. అధునాతన కెమెరాలు, సెన్సార్లు వాహనాలను గుర్తించి రియల్ టైమ్‌లో టోల్ వసూలు చేస్తాయి. టోల్ రద్దీని తగ్గించేందుకు, జాప్యాన్ని నివారించేందుకు National Highways Authority of India (NHAI) ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది.RFID, ANPR టెక్నాలజీల సమ్మేళనంతో ఫాస్టాగ్ స్టిక్కర్‌ను స్కాన్ చేసి సంబంధిత ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. ఫాస్టాగ్ లేని వాహనాల నంబర్ ప్లేట్‌లను హై-రిజల్యూషన్ కెమెరాలు గుర్తించి డిజిటల్ ఇన్‌వాయిస్ జారీ చేస్తాయి. ఈ సందర్భంలో అదనపు జరిమానా కూడా విధించబడుతుంది.సేకరించిన డేటా మొత్తం సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్‌కు పంపబడుతుంది. అక్కడ వాహనం గుర్తింపు, టోల్ లెక్కింపు తక్షణమే పూర్తవుతుంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు తగ్గడంతో పాటు ఇంధన వినియోగం, వాహన కాలుష్యం కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.ఈ వ్యవస్థ ద్వారా రవాణా సామర్థ్యం పెరుగుతుందని, లాజిస్టిక్స్ వేగవంతమవుతాయని NHAI పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లను బ్యారియర్-ఫ్రీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరిన్ని హైవేలపై విస్తరించే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa