యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్తాన్ మధ్య విభేదాలు ముదురుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎతిహాద్ ఎయిర్‌వేస్ తన సంస్థలో పనిచేస్తున్న 18 మంది పాకిస్తానీ ఉద్యోగులను తొలగించింది.ఇదే కాకుండా, ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం సంచలనంగా మారింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు 18 ఏళ్లుగా అదే సంస్థలో పనిచేస్తుండటం గమనార్హం. ఉద్యోగం నుంచి తొలగించిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద రిపోర్ట్ చేయాలని సూచించడం మరింత చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులను ఇమ్మిగ్రేషన్ వద్దకు పంపడం అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాకిస్తానీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న చర్యలేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కేవలం రెండు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడంతో, అంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం కష్టమవుతోందని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్‌కు విదేశాల నుంచి వచ్చే నగదు ప్రవాహం అత్యంత కీలకం. ముఖ్యంగా యూఏఈలో పనిచేస్తున్న పాకిస్తానీలు పంపించే డబ్బులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలు పాకిస్తాన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఈ తొలగింపులపై ఇప్పటి వరకు ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలు, అలాగే సౌదీ అరేబియా–పాకిస్తాన్ మధ్య ఒప్పందం యూఏఈ అసంతృప్తికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో యూఏఈ, పాకిస్తాన్‌కు ఇచ్చిన 3 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని కోరినట్లు సమాచారం. ఇరాన్ దాడులపై సౌదీ, పాకిస్తాన్ దేశాలు సరైన స్పందన ఇవ్వలేదన్న అసంతృప్తి కూడా యూఏఈలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa