పంజాబ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు హాజరయ్యారని కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (SAD) తీవ్ర ఆరోపణలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం వెంటనే ఆల్కహాల్ టెస్ట్ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్‌ను కోరారు. అంతేకాకుండా, సభలోని అన్ని సభ్యులకు డోప్ టెస్ట్ నిర్వహించాలని, చండీగఢ్‌లోని PGIMER వైద్య నిపుణులతో స్వతంత్ర పరీక్షలు చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
*ప్రతిపక్షాల ఆరోపణలు : కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు హాజరయ్యారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతూ మేము వాకౌట్ చేశాం. అవసరమైతే మేమూ పరీక్షలకు సిద్ధమే” అని ఎక్స్ (X) వేదికగా తెలిపారు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తిస్తే అసెంబ్లీ నిర్వహణపై ప్రశ్నలు వస్తాయి. అందరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి” అని విమర్శించారు.శిరోమణి అకాలీదళ్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, “కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం దురదృష్టకరం. ఆయనపై వెంటనే డోప్ టెస్ట్ చేయాలి” అని పేర్కొంది.రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ భగవంత్ మాన్‌పై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, “ఒక సరిహద్దు రాష్ట్రానికి సీఎం ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. తక్షణమే పరీక్షలు నిర్వహించి అవసరమైతే చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.బీజేపీ నేత సునీల్ జాఖడ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో బ్రెత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తే అనేక నిజాలు బయటపడతాయని విమర్శించారు.
*ప్రతిపక్షాల డిమాండ్లు:కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ స్పీకర్‌కు అధికారిక లేఖ సమర్పించింది. గంటలోపు ముఖ్యమంత్రితో సహా సభ్యులందరికీ ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించాలని, స్వతంత్ర వైద్య బృందంతో డోప్ టెస్ట్ చేయించాలని కోరింది. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa