తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ వాతావరణం వేడెక్కింది. మెజారిటీ సర్వేలు డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, ఒక సర్వే మాత్రం సంచలన అంచనాతో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.అయితే, ఆ సర్వే సంస్థ గత లోక్‌సభ ఎన్నికల్లో చేసిన అంచనాలు తప్పు తేలిన విషయాన్ని గుర్తుచేస్తూ డీఎంకే, ఏఐఏడీఎంకే సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడూ ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను ప్రతిబింబించలేవని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి అంచనాలు వాస్తవ ఫలితాలకు భిన్నంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై చర్చ మరింత ఊపందుకుంది.ఎక్కువ సర్వేలు డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు జేవీసీ (టైమ్స్ నౌ), ఓట్ వైబ్ (సీఎన్ఎన్ న్యూస్18) సర్వేలు ఏఐఏడీఎంకేకు అవకాశం ఉందని పేర్కొన్నాయి. కానీ ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ఆశ్చర్యకరంగా మెజారిటీ సాధిస్తుందని అంచనా వేయడం చర్చకు కారణమైంది.ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి, టీవీకే రెండూ దాదాపు 35 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని, ఏఐఏడీఎంకే కూటమి 23 శాతం ఓట్లతో పరిమితమవుతుందని అంచనా వేసింది. సీట్ల పరంగా టీవీకే 98–120 స్థానాలు, డీఎంకే కూటమి 92–110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఏఐఏడీఎంకే కూటమికి 22–32 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేయడం గమనార్హం.అయితే ఈ అంచనాలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ గతంలోనూ తప్పు అంచనాలు ఇచ్చిందని ఏఐఏడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. డీఎంకే నేతలు కూడా ఈ సర్వేను “వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్న అంచనా”గా అభివర్ణించారు.మరోవైపు టీవీకే నాయకులు మాత్రం 200 సీట్ల వరకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంచనాలను అనుమానంగా చూస్తున్నారు. టీవీకేకు పట్టణ ప్రాంతాల్లో మద్దతు ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం కీలక లోపమని పేర్కొంటున్నారు.సగటుగా టీవీకే 17–25 శాతం ఓట్లు సాధించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలోకి మారే అవకాశం తక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ కొనసాగుతుండగా, అసలైన ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa