ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి, రూ.668 కోట్లతో ప్లాన్,,,విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:55 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎంత ముఖ్యమో, పొరుగున ఉన్న విజయవాడ నగరం కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌, నేషనల్ హైవే 16 కనెక్టివిటీకి విజయవాడ కీలకంగా ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వం కొన్ని కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడకు వచ్చే జనాల సంఖ్య పెరిగింది.. ఈ ప్రభావం నగరంలో ట్రాఫిక్‌పై కూడా పడింది. కొంతకాలంగా విజయవాడలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నగరానికి బైపాస్‌లతో పాటుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును కూడా కనెక్ట్ చేస్తున్నారు.


విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి (కారిడార్)ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో ప్రతిపాదనలు తీసుకురాగా.. ఆ తర్వాత పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి ప్రతిపాదనపై కదలిక వచ్చింది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 విజయవాడ నగరం మీదుగా వెళుతోంది. ఈ జాతీయ రహదారిలో విజయవాడ మహానాడు కూడలి నుంచి నిడమానూరు రైల్వే వంతెన అవతలి వరకు ఈ ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించాలని ప్లాన్ చేశారు. గతంలో ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఈ ప్రాజెక్టును రూ.668 కోట్లతో ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.


ఈ ఎలివేటెడ్ వంతెన ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనుకుంటున్న సమయంలో కొన్ని కారణాలతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పక్కన పెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ బ్రిడ్జి విజయవాడలో చాలా కీలకమంటూ.. ఆవశ్యకతను ఎన్‌హెచ్‌ఏఐ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ వంతెనను వన్‌టైమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కింద నిర్మించాలని రిక్వెస్ట్ చేయనుంది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 విజయవాడ మధ్యలో నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.


ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం మహానాడు కూడలి నుంచి నిడమానూరు రైల్వే వంతెన అవతలి వరకు బ్రిడ్జిని నిర్మించాలని కోరనుంది. మొత్తం 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెనను గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌ఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డీపీఆర్‌ను కూడా సిద్ధం చేయించారు. మరి ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్‌పై ఎన్‌హెచ్‌ఏఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. ఒకవేళ ఓకే చెబితే పాత డీపీఆర్‌‌ వైపు మొగ్గు చూపుతారా.. కొత్తగా మళ్లీ డీపీఆర్ సిద్ధం చేస్తారా అన్నది చూడాలి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్తగా ఎలివేటెడ్ వంతెనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa