పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దహించివేసే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో రగిలిపోతున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా.. ఆదేశాలను ధిక్కరించే నౌకలకు నిప్పు పెడతాం అంటూ భీకర హెచ్చరికలు జారీ చేసింది.
హార్మూజ్ జలసంధి అనేది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు. అది ప్రపంచ ఇంధన అవసరాలకు వెన్నెముక వంటిది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడిచమురులో ఐదో వంతు (సుమారు 20 శాతం) ఈ ఇరుకైన జలసంధి గుండానే రవాణా అవుతుంది. కేవలం కొన్ని కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏ నౌక అయినా ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తాజాగా ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
భారత్, ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం
హార్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం అత్యధికంగా ఆసియా దేశాలపై పడనుంది. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు అందే చమురు, సహజ వాయువు (ఎల్ఎన్‌జీ) అత్యధికంగా ఈ మార్గం నుంచే వస్తాయి. ఈ అంతరాయం వల్ల ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా సముద్ర మార్గంలో నౌకలకు ఇచ్చే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగాయి.
ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం?
ఇరాన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల విమాన ప్రయాణాలు, రవాణా రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఇంధన కొరత తోడైతే నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ తన సుప్రీం నేత మృతికి ప్రతీకారంగా ప్రపంచాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa