పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ఇరాన్ అణు సామర్థ్యంపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సంచలన విషయాలను వెల్లడించారు. ఇరాన్ వద్ద ఇప్పటికే 11 అణు బాంబులను తయారు చేయడానికి సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని.. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ అధికారులే గర్వంగా తమ ముందు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
చర్చల సమయంలోనే సంచలన వెల్లడి..
ఈ ఏడాది ప్రారంభంలో అణు కార్యక్రమాలను నిలిపివేసే అంశంపై చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను, జారెడ్ కుష్నర్ను ప్రతినిధులుగా పంపారని విట్కాఫ్ గుర్తు చేసుకున్నారు. "మేము ఇరాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నప్పుడు.. వారు ఎంతో అహంకారంతో తమ అణుశక్తి గురించి గొప్పలు చెప్పుకున్నారు. ప్రస్తుతం తమ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయని, వాటితో 11 అణుబాంబులను సిద్ధం చేయగలమని వారు మాతో నేరుగా చెప్పారు" అని విట్కాఫ్ వివరించారు.
10 రోజుల్లోనే బాంబు సిద్ధం!
ఇరాన్ ప్రతినిధుల వాదన ప్రకారం.. వారి వద్ద ఉన్న నిల్వలతో కేవలం 10 రోజుల్లోనే అణ్వాయుధాలను తయారు చేయగలరు. "బాంబులు తయారు చేయడాన్ని అడ్డుకునే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదని వారు మాతో చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే అది అమెరికా భద్రతకే ముప్పు అని మేము భావించాము. ఎంత ప్రయత్నించినా వారు మొండితనం వీడకపోవడంతో.. ఇక చర్చలు సాధ్యం కాదని తేల్చి చెప్పి దాడులు ప్రారంభించాము" అని విట్కాఫ్ వెల్లడించారు.
దాడులతో విచ్ఛిన్నమైన అణు కలలు
అయితే ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు ఉన్నప్పటికీ.. వాటిని బాంబులుగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికా ఇప్పటికే దెబ్బ తీసిందని విట్కాఫ్ ధీమా వ్యక్తం చేశారు. గతేడాది అమెరికా చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు, లాబొరేటరీలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయని చెప్పారు. దీనివల్ల తక్షణమే బాంబులను తయారు చేసే అవకాశాన్ని వారు కోల్పోయారని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa