బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మకు సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్స్, ఫీల్‌గుడ్ ఎమోషనల్ చిత్రాలను బాగా తీయగలరనే పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’ 2001లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఇందులో సన్నీ దేఓల్.. తారాసింగ్ పాత్ర పోషించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా దాదాపు 22 ఏళ్ల తర్వాత అనిల్ ‘గదర్ 2’ తీశారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌సక్సెస్ అయింది. అంతే కాదు.. రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలరని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గదర్’ చిత్రం తీస్తే తారాసింగ్ పాత్రకు ఎవరు సరిపోతారనే ప్రశ్నకు అనిల్ శర్మ ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ఈ తరం వాళ్లతో ‘గదర్’ చిత్రం చేయాలంటే తారాసింగ్ పాత్రకు సరిపడే హీరోలు ఈతరం వారు నాకు ఎవరూ కనిపించడం లేదు. బాలీవుడ్లో లేరు కానీ... దక్షిణాది హీరోలు ఉన్నారు. జూ.ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలరని నా నమ్మకం’ అని చెప్పారు.