నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. యశ్వంత్ నిర్మాత. ఈనెల 6న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఈమధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్ ఇది. అన్ని సినిమాలూ వేరు, ఈ సినిమా వేరని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. నవీన్ ఎప్పటి నుంచో నాకు మంచి స్నేహితుడు. తన నటన చాలా బాగుంద’’న్నారు. ‘‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. శ్రీకాంత్తో ఇది రెండో సినిమా. తనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తా. స్వాతి, శ్రేయ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లార’’న్నారు నవీన్ చంద్ర. ‘‘ఈ కథలో ప్రతీ పాత్ర కీలకమే. ప్రతీ పాత్రకూ కొన్ని లెక్కలుంటాయి. ప్రతీ పాత్రకూ గౌరవాన్ని కల్పించార’’న్నారు స్వాతి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘శ్రేయా నా పందెం గుర్రం. తన పాత్రపై నేను బెట్ కాస్తున్నా. తను ఎంత బాగా చేసిందో సినిమా చూశాకే అర్థం అవుతుంది. నవీన్ చంద్ర ప్రతీ షాట్లోనూ సర్ప్రైజ్ చేస్తాడ’’న్నారు.