దళపతి విజయ్ 68వ చిత్రం సోమవారం చెన్నైలో అట్టహసంగా ప్రారంభమైంది. ఏజీఎస్ బ్యానర్లో కళాపతి అగోరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ నాట క్రేజీ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనుండగా.. తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న పొడుగుకాళ్ల సుందరి మీనాక్షి చౌదరి ఈ సినిమాతో తమిళనాట కథానాయికగా అడుగు పెట్టనుంది. చాలాకాలం తర్వాత యువన్ శంకర్ రాజా, విజయ్ చిత్రానికి సంగీతం అందించనుండడం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్ర షూటింగ్‌ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ హీరోలు ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, యోగిబాబు, ప్రేమ్ జీలతో పాటు.. మళయాళ స్టార్ జయరాం, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ వంటి స్టార్లు.. స్నేహ, లైలా వంటి సీనియర్ నటీమణులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కనుండగా 2024 వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చివరగా నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘కస్టడీ’ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే.