గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' వార్తల్లో వుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న హైదరాబాదులోని యూసుఫ్ గూడ, పోలీసు గ్రౌండ్స్ లో జరగాల్సి ఉండగా, ఆ వేడుకకి పోలీసు అధికారుల అనుమతి లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు ఆ వేడుక ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు దగ్గర ఈరోజు (జనవరి 9) చేస్తున్నారు. అలాగే ఆ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇస్తుందా, ఇవ్వదా అనే సందేహం కూడా మహేష్ బాబు అభిమానుల్లో చోటుచేసుకుంది.అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక జీఓ ని విడుదల చేసింది. అందులో 'గుంటూరు కారం' సినిమాకి మొదటి వారం టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చినట్టుగా పేర్కొంది. మల్టీ ప్లెక్స్ లో రూ. 100 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో రూ. 65 రూపాయలు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా ఆ జీవోలో వుంది. అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో ఒక ఉదయం 4 గంటల నుండి ఆటలు వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవోలో చెప్పింది. ఈ అదనపు ఆట మొదటి వారానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పింది.