పాన్ ఇండియా స్టార్ యశ్ పుట్టినరోజు రోజు సందర్భంగా సోమవారం కటౌట్లు కడుతూ కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే! వారి కుటుంబాలను యశ్ ఓదార్చారు. షూటింగ్ పనులతో బిజీగా ఉన్న అయన ఈ సంఘటన గురించి తెలియగానే ప్రత్యేక విమానంలో హుబ్లీకి వచ్చి ఆపై కారులో గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన యువకుల కుటుంబాలను చూసి చలించిపోయారు. స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తుండటంతో నేను ఈసారి పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని నాలుగు రోజుల ముందే అభిమానులకు తెలియజేశా. నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దని చెప్పాను. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారంటే నాకు చాలా బాధగా ఉంది. చేతికి వచ్చిన బిడ్డలు ఇక తిరిగిరారని తెలిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ యువకుల కుటుంబానికి ఏది అవసరమో అది నేను చేస్తాను. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగిరారు. కానీ ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటాను’’ అని భరోసా ఇచ్చారు యశ్. "ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే నా పుట్టినరోజున బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలి ఎన్నో సార్లు కోరాను. నాపై ప్రేమను చూపించాలంటే మీ భవిష్యత్తు కోసం ఏదైనా చేసుకోండి. నేను ఇక్కడకు వచ్చేటప్పుడు కూడా కొందరు బైకులపై వేగంగా నా కారును ఫాలో అయ్యారు. దయచేసి అలా చేయకండి. ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టే నాకు పుట్టినరోజు వస్తోందంటేనే భయమేస్తోంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం. ఇకపై వారి కుటుంబాల బాధ్యత నాది. అయితే అభిమానులకు నేను చెప్పేది ఒకటే. మీ జీవితంలో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. ఇలాంటి పనులు మరోసారి చేయకండి. ఇక నుంచైనా ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు వదిలేయండి. ఇంత ప్రమాదకరమైన ప్రేమను తెలపడం ఎవరికీ ఇష్టం ఉండదు’’ అని యశ చెప్పారు. ఈ ఘటనలో గాయాలపాలైన మరో ముగ్గురిని ఆస్పత్రిలో కలిసి మాట్లాడారు.