ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. బాంబే ఐఐటీ టెక్‌ఫెస్ట్‌లో అతిథిగా పాల్గొన్న ఆయన సినిమా షూటింగ్ ఆలస్యమవడానికి గల కారణాలు తెలిపారు. ‘మేము ఈ సినిమా కోసం ప్రతి దాన్నీ స్క్రాచ్ నుంచి తయారు చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే చిత్రీకరణలో సగం సమయం ఇంజినీరింగ్ వర్క్‌కే సరిపోతోంది. ఫిల్మ్ మేకింగ్ కన్నా కూడా ఆ పనే ఎక్కువ చేస్తున్నానన్న ఫీలింగ్ ఉంది. ఈ సినిమాలో మీరంతా భవిష్యత్ ప్రభాస్‌ను చూడబోతున్నారు’’ అని అన్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోంది. సినిమా సెట్స్‌తో పాటు ఆయుధాలు ఇతర వస్తువులు సరికొత్తగా, నేచురల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగితం అందిస్తున్నారు.