సంక్రాంతి పండగ వచ్చేస్తోంది అంటే తెలుగు ప్రజలు సినిమాలు కూడా చూడటానికి ఇష్టపడతారు. ఈసారి సంక్రాంతి పండగకి పెద్ద సినిమా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' అయితే, దానితో పోటీగా అదేరోజు విడుదల చేస్తున్న సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మించిన 'హనుమాన్'. తేజ సజ్జ ఇందులో కథానాయకుడు, అమృత అయ్యర్ కథానాయకురాలు, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకో ప్రధానపాత్రలో కనపడతారు. ఇది ఒక సూపర్ హీరో సినిమా, తేజసజ్జ ఇందులో ఒక సూపర్ మేన్ గా కనపడతాడు. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది, కానీ మహేష్ బాబు సినిమా చాలా థియేటర్స్ లో విడుదల అవటం వలన ఈ సినిమాకి థియేటర్స్ దొరకటం కష్టం అయింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ ఆటలు జనవరి 11న చాలా థియేటర్స్ లో వేశారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ 'హనుమాన్' ఎలా వుందో చూద్దాం.
హనుమాన్ కథ:
అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) వుంటారు. హనుమంతు ఆ వూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ వూరికి హనుమంతు చిన్నప్పటి స్నేహితురాలు మీనాక్షి (అమృత అయ్యర్) డాక్టర్ గా చదువు పూర్తి చేసుకొని వస్తుంది. అదే వూరిలో వున్న ఒక బలమైన వస్తాదు ఆ వూరిలో దోపిడీ దొంగతనాలు చేయించి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. ఒకసారి మీనాక్షి వెళుతున్న బస్సు మీదకి దోపీడీ దొంగలు వస్తే, అందరూ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోవటానికి అడివిలోకి పారిపోతారు. ఆ సమయంలో హనుమంతు వచ్చి మీనాక్షిని కాపాడతాడు, అదే సమయంలో దొంగలు హనుమంతుని పొడిచి అక్కడ నదిలో పడేస్తారు. హనుమంతు నీటి అడుగుకి కొట్టుకుపోతున్నప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది, తరువాత దెబ్బలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన అతన్ని ఆ ఊరి ప్రజలు ఇంటికి చేరుస్తారు, కట్లు కడతారు, కానీ అతను కోలుకోవటం కష్టం అంటారు. మణి ప్రభావంతో హనుమంతుకి దెబ్బలు మాయం అయిపోతాయి, ఒక్కసారిగా సూపర్ మాన్ లా తయారవుతాడు. అదే సమయంలో మైకేల్ (వినయ్ రాయ్) అనే అతను అతని అసిస్టెంట్ (వెన్నెల కిషోర్) తో ఆ మణి గురించి తెలిసి అది కాజేయాలని, ఆ వూరికి వస్తారు. ఇంతకీ మైకేల్ ఎవరు? అతను ఎందుకు ఈ మణిని చేజిక్కుంచుకోవాలని అనుకున్నాడు? ఆ మణి నేపధ్యం ఏంటి? సూపర్ మేన్ గా మారిన హనుమంతు ఆ వూరికి ఏమి చేసాడు? అంజమ్మ పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'హనుమాన్' చూడాల్సిందే.