ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి సందడి చేసిన నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 04:24 PM

నాగార్జున ఇంతకు ముందు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలు సంక్రాంతికి విడుదల చేసి విజయం సాధించారు. ఆ రెండు సినిమాలకి నేపధ్యం పల్లెటూరు, ఆ వూర్లో వుండే తగాదాలు, పండగ వాతావరణం. ఇప్పుడు 'నా సామి రంగ' లో కూడా అలాంటి నేపధ్యం వున్న కథనే ఎంచుకున్నారు నాగార్జున. దీనికి విజయ్ బిన్నీని దర్శకుడిగా పెట్టుకున్నారు. అతను కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు. మలయాళం సినిమా 'పొరింజు మరియం జోస్' ని గోదావరి జిల్లాలోని ప్రాముఖ్యం వహించిన ప్రభల తీర్ధం పండగ నేపధ్యంగా మార్చారు. అది కూడా సంక్రాంతికి వచ్చే పండగే. అందుకే నాగార్జున ఈ సినిమాని సంక్రాంతి పండగకి పట్టుబట్టి మరీ విడుదల చెయ్యాలనే ఉద్దేశంతో మూడు నెలల్లో పూర్తి చేశారు. అది గొప్ప విషయమే. అందుకు క్రెడిట్ విజయ్ బిన్నీకి చెందాలి, దర్శకుడిగా ఈ సినిమాతో అరంగేట్రం చేసాడు, తొందరగా తీసినా మంచి క్వాలిటీతో తీశాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో కథ ఏమీ కొత్తగా ఉండదు, కానీ కథనం, మాటలు, సన్నివేశాలు బాగుంటాయి. ఉదాహరణకి నాగార్జున, అల్లరి నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి, అలానే నాగార్జున, ఆషిక రంగనాథ్ మధ్య వచ్చే సన్నివేశాలు, మాటలు అన్నీ బాగుంటాయి. నాగార్జున, అల్లరి నరేష్ ఇంకా చాలామంది ఈ సినిమాలో ఎక్కువగా లుంగీలు కట్టుకొని కనపడుతూ వుంటారు. అందువలన పల్లెటూరి నేపథ్యం, పండగ వాతావరణం సినిమాలో ఎక్కువగా కనపడి ప్రేక్షకులని అలరిస్తాయి. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకి గోదావరి యాసలో మాటలు రాయడంతో సినిమాలో సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. అల్లరి నరేష్ పాత్రకి ప్రేక్షకుల నుండి బాగా సింపతీ వస్తుంది, ఎందుకంటే అతను అంత బాగా చేశాడు, హైలైట్ అయింది అతని పాత్ర. అలాగే రావు రమేష్ పాత్ర చిన్నదైనా అతని ప్రభావం పెద్దగా ఉంటుంది, తనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోయి చేస్తాడు, వైవిధ్యం చూపిస్తాడు. రాజ్ తరుణ్ పాత్రకి అంతగా ప్రాముఖ్యం లేకపోయినా పరవాలేదు అనిపించేట్టు వుంది. ఆషిక రంగనాథ్ వరాలుగా చాలా బాగా నటించింది. రెండు కోణాలుంటాయి ఆమె పాత్రకి, ఒకటి టీనేజ్, రెండోది ఒక పెద్దమనిషి తరహాలో వుండే పాత్ర, ఆమె బాగా అభినయించి చూపించింది. అందంగా కూడా కనపడుతుంది. నాజర్ ఊరి పెద్దగా బాగున్నారు. తమిళ సినిమాలలో కనిపించే షబీర్ ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపిస్తాడు, బాగా చేసాడు. ఇక మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. వీళ్లందరికన్నా కథానాయకుడి పాత్రలో నాగార్జున మరోసారి గోదావరి జిల్లా యాసతో ప్రేక్షకులని కట్టి పడేసారు. డాన్సులు, పోరాట సన్నివేశాలు అదరగొట్టారు. ముఖ్యంగా ఆషిక రంగనాథ్ తో వచ్చిన సన్నివేశాల్లో అయితే అతని అభిమానులకు పండగే అని చెప్పాలి. అయన ఆరోగ్య రహస్యం ఏంటో కానీ, నాగార్జునకి వయసు పెరుగుతున్నకొద్దీ మరింత చిన్నగా కనపడుతూ వుంటారు, అందులో మాత్రం యువ నటులతో సమానంగా కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వర రావు అభిమానులు కూడా సంతోష పడేట్టు ఏ.ఎన్.ఆర్ పాటలు వినపడతాయి. అలాగే ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ నటించిన 'గుండమ్మకథ' సినిమా స్టిల్ కూడా కనపడుతుంది. చివరగా, 'నా సామి రంగ' సినిమా కథ పాతదే అయినా, మాటలు, కథనం మాత్రం కొత్తగా ఉంటాయి. నాగార్జున, నరేష్ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, కీరవాణి సంగీతం, ప్రసన్న కుమార్ మాటలు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సినిమాలో పండగ వాతావరణం కనిపిస్తుంది. నాగార్జున అభిమానులకు నచ్చే సినిమా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com