రజినీకాంత్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా వున్నారు. అతను ప్రత్యేక పాత్రలో నడిచిన 'లాల్ సలాం' సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. తన తదుపరి సినిమా 'వెట్టయాన్' షూటింగ్ చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితిక సింగ్, రావు రమేష్ ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని జమ్మలమడుగులో జరుగుతోంది.ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కడపలో సందడి చేశారు. ఈ జిల్లాలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సబంధించిన షూటింగ్ జరుగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర, ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో 'వెట్టయాన్' సినిమా షూటింగ్ అవుతోంది. అందులో భాగంగా రజనీకాంత్, ఫహాద్ ఫాజిల్, రితిక సింగ్, కృష్ణుడు ల మీద ఆ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. చూడటానికి వచ్చిన అభిమానులకి రజినీకాంత్ చెయ్యి ఊపుతూ, నమస్కారం పెడుతూ అభివాదం చేశారు. ఈ షూటింగ్ కోసం చెన్నై నుంచి రజినీకాంత్ కడప చేరుకొని, అక్కడ నుంచి షూటింగ్ నిమిత్తం జమ్మల మడుకు వచ్చారు. అక్కడ షూటింగ్ చేస్తున్న తలైవాను చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. రజినీకాంత్ ని చూడటానికి, చుట్టుపక్కల గ్రామాల, ప్రాంతాల నుండి తండోపతండాలుగా అయన అభిమానులు వచ్చారు. ఇది రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమా, దీనికి 'జై భీం' ఫేమ్ టి జ్ఞానవేల్ దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. జమ్మలమడుగు ప్రాంతం నాపరాయి గనులకు ప్రసిద్ది. ఇక్కడ ఎర్రగుంట్ల ప్రాంతంలోని నాపరాయి గనిలో ఈ చిత్రీకరణ సాగుతోంది.