ఇప్పుడు నయనతార టైమ్ నడుస్తోంది. తమిళనాట లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తెలుగు, మలయాళ చిత్రాలను కూడా అడపాదడపా చేస్తూనే ఉంది. పైపెచ్చు ఆమె నటించిన కొన్ని చిత్రాలు తెలుగునాట అనువాదమవుతున్నాయి కూడా. ఈ ఏడాది ఆరంభంలో ఆమె నటించిన విశ్వాసం సూపర్‌డూపర్ హిట్టయింది. అయితే ఇటీవల ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఐరా చిత్రం బాక్సాఫీసు వద్ద ఆమెకు నిరాశనే మిగిల్చింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై నయన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం మరోవిధంగా వచ్చింది. ఇదిలావుండగా…ఈ ఏడాది మరో నాలుగు చిత్రాలతో వరుసగా ఆమె సందడి చేయబోతుండటం ఓ విశేషం. ఐరా తర్వాత తాజాగా రాబోతున్న చిత్రం కొలైయుధీర్‌కాలం. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తారో…లేదో ఇంకా తెలియలేదు. అలాగే ఆమె నటించిన మిస్టర్ లోకల్ అనే చిత్రాన్ని మేలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో రూపొందుతున్న సైరా..నరసింహారెడ్డి చిత్రంలోనూ నయన్ నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంతో పాటు విజయ్ సరసన తమిళంలో ఆమె నటిస్తున్న తలపతి 63 చిత్రం కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa