'సీతారామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సీత పేరుతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్ . కథల ఎంపికలో ఆమె ఆచితూచి అడుగులేస్తుందీ బ్యూటీ. ‘సీతారామం’ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’లో యష్నగా కనిపించి చక్కని గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ దక్షిణాదిలో వస్తున్న మంచి పాత్రలు బాలీవుడ్‌లో రావడం లేదని వ్యాఖ్యలు చేసింది. ‘'నాకు హిందీలో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమాల్లో నటించాలనేది నా కోరిక. కానీ అలాంటి కథలు, పాత్రలు బాలీవుడ్‌లో రావడం లేదు. కేవలం కథానాయిక పాత్రలే కాదు.. తల్లి, అక్క లాంటి పాత్రలు పోషించడానికి నేను రెడీగా ఉన్నా. ఆ తరహా పాత్ర పోషించడానికి నేను భయపడను. ఏడాదికి ఐదారు సినిమాల్లో నటించేయాలనే టార్గెట్ ఏమీ లేదు. ఏడాదికి ఒక సినిమా చేసినా అది సినీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా వారికి గుర్తుండిపోయేలా పాత్ర ఉంటే చాలు. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాపై ఎన్నో విమర్శలు చేశారు. అసలు గ్లామర్ పాత్రలకు పనికి రానని తేల్చేశారు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లోనే కనిపించాలని లేదు కదా. దర్శకులు మలుచుకునే పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడతాను’’ అని కెరీర్ బిగినింగ్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. అంతే కాదు ఈ చిత్రం తర్వాత తమిళ పరిశ్రమలోనూ అడుగుపెట్టనుంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. హీరో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా మృణాల్‌ను ఖరారు చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో సానుకూలంగా స్పందించిందని సమాచారం.