నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన బ్రీత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ మధ్య చాలా పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు సైతం 15 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండగా ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి మాత్రం మూడు నెలలపైనే పట్టడం గమనార్హం. అయితే ఈ సినిమా వచ్చిన సంగతి, వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి గుర్తు లేకపోవడమే కాక, తెలుగు సినిమా చరిత్రలో జీరో కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ బ్రీత్ పేరు మూట గట్టుకున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.