నా పాత్రలో ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నా పాత్ర ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ఈ కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్‌ను దర్శకుడు హర్ష చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి యాక్షన్ సీన్‌లో ఎమోషన్ ఉంది. అది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన ‘భీమ’ చిత్రం ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘భీమ’ జర్నీ ఎలా మొదలైందో చెబుతూ ‘ఈ చిత్ర సహనిర్మాత శ్రీధర్ కొవిడ్ సమయంలో దర్శకుడు హర్షను పరిచయం చేశారు. ఆయన ఒక కథ చెప్పారు కానీ అలాంటి సమయంలో వద్దనిపించింది. అందుకే పోలీసుకి సంబంధించి ఏదైనా విభిన్నమైన కథ ఉంటే చెప్పమన్నా. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకుని ఈ కథ చెప్పారు. హీరో పాత్ర పేరు భీమ. ఈ కథకు అదే పేరు యాప్ట్ కనుక టైటిల్‌గా నిర్ణయించాం. భీమ క్యారెక్టరైజేషన్ నచ్చి అంగీకరించా’ అన్నారు. తమ సినిమాకీ, ‘అఖండ’ చిత్రానికీ పోలికలు లేవని అని స్పష్టం చేశారు. ‘అఘోరాలు, కలర్ ప్యాట్రన్, మ్యూజిక్ వల్ల అలా అనిపించి ఉండవచ్చు. కానీ ‘భీమ’ పూర్తిగా డిఫరెంట్ స్టోరీ. అయినా ‘అఖండ’తో పోలిస్తే మంచిదేగా’ అని నవ్వేశారు గోపీచంద్. తన కొత్త సినిమాల గురించి చెబుతూ ‘శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ప్రసాద్‌గారితో ఒక సినిమా ఉంటుంది. అలాగే యూవీ క్రియేషన్స్‌లో చేయబోయే చిత్రానికి కథ తయారవుతోంది’ అన్నారు గోపీచంద్.