ప్రస్తుతం చిన్న చిత్రాలను ప్రేక్షకుల వద్దకు చేర్చడం కష్టతరంగా మారిందని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ అన్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రెబల్’ . ఈనెల 22న విడుదలకానుంది. స్టూడియోగ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు పా. రంజిత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది రెబల్ ఆడియో వేదికగా లేదు. నన్ను ప్రశంసించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలా ఉంది. ఇంతమంది నన్ను ప్రశంసిస్తున్నారంటే నేను నా విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నాననే భావన కలుగుతోంది. ఈ సినిమా కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ముల్లై పెరియార్ ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా ఉండే సమస్యను దర్శకుడు నికేష్ చాకచక్యంగా డీల్ చేశారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారు. నా జీవితంలో కూడా ముఖ్యమైన మనిషి. హీరో జీవీ ప్రకాష్ చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా అందరికీ సక్సెస్‌ని ఇవ్వాలని పేర్కొన్నారు.