స్క్రిప్ట్, స్క్రిన్‌ప్లే పక్కాగా ఉంటే డైనోసార్‌ను హీరో పాత్రలో పెట్టి సినిమా తీసినా విజయం తథ్యమని, ఈ మాటలు వివాదాస్పదం అవుతాయని తెలిసినప్పటికీ.. ఇదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ అన్నారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత జి. ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం ‘కల్వన్’ . ఏప్రిల్ 4వ తేదీన విడుదలకానుంది. జీవీ ప్రకాష్ కుమార్, ఇవాన హీరోహీరోయిన్లు. దర్శక శిఖరం భారతీరాజా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ధీనా, ఙ్ఞానసంబంధం, వినోద్ మున్నా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. హీరోగా నటించిన జీవీ ప్రకాష్ పాటలకు సంగీతం అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెవా కంపోజ్ చేశారు. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పీవీ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయనే చాయాగ్రహణం కూడా అందించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక శనివారం నగరంలో జరిగింది. దర్శకుడు వెట్రిమారన్ ముఖ్య అతిథిగాను, సీనియర్ దర్శకుడు ఉదయకుమార్, పేరరసు, లింగుస్వామి, అమ్మ క్రియేషన్స్ అధినేత టి.శివ, సత్యజ్యోతి ఫిలిమ్స్ అధినేత త్యాగరాజన్, నిర్మాత ధనుంజయన్‌లతో పాటు జీవీ ప్రకాష్, ఇవాన, పీవీ శంకర్, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘‘ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. నిజానికి అడవిలో ఒక చిత్రం షూటింగ్ చేయడం చాలా కష్టం. ఒక సన్నివేశాన్ని వెండితెరపై అద్భుతంగా పండించే దర్శక నటుడు భారతీరాజా. ఆయన పాత్ర చిత్రానికి ఎంతో బలం. జీవీ ప్రకాష్ కమిట్‌మెంట్ కలిగిన నటుడు. అటు సంగీత దర్శకుడిగా, ఇటు హీరోగా రాణిస్తున్నారు’ అన్నారు.