తమిళ చిత్రపరిశ్రమలో వైవిద్యభరితమైన చిత్రాలను తెరకెక్కించడంలో దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్ ఒకరు. గతంలో ఆయన ఒకే ఒక నటుడుతో ‘ఒత్త చెరుప్పు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ‘ఇరవిన్ నిళల్’ పేరుతో నాన్ లీనియర్ పేరుతో సింగిల్ షాట్ మూవీని రూపొందించారు. ఈ రెండు చిత్రాలు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలతో అవార్డులను సైతం అందుకున్నాయి. ఇపుడు 13 మంది టీనేజ్ పిల్లలతో కలిసి ఆయన తెరకెక్కించిన చిత్రం ‘టీన్స్’. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ప్రముఖులు భాగ్యరాజ్, కేఎస్ రవికుమార్, పేరరసు, చరణ్, విరుమాండి, వనితా విజయకుమార్, రోబో శంకర్, యోగిబాబు, పుగళ్ తదితరులు హాజరయ్యారు. ఇందులో నటుడు భాగ్యరాజ్ మాట్లాడుతూ... నాకు మంచి అసిస్టెంట్ దర్శకులు లభించారు. అందుకే నేను భాగ్యరాజ్ అయ్యాను. పార్తిబన్ విభిన్నమైన ఆలోచనా ధోరణి నాకు బాగా నచ్చుతుంది. నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలోనే ఏదో కొత్తగా చేయాలని అనుకునేవారు. ఇపుడు ఆ విధంగానే వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మిస్తున్నారని, అతనిని చూస్తే గర్వంగా ఉందని అన్నారు.