ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలియా భట్ 'జిగ్రా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ... !

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 10:21 PM

అలియా భట్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా పేరే 'జిగ్రా'. కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాకి, వాసన్ బాల దర్శకత్వం వహించాడు. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, అక్టోబర్ 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.


రివ్యూ: సత్యభామ (అలియా భట్) అంకుర్ (వేదాంగ్ రైనా) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతారు. అప్పటి నుంచి దూరపు బంధువుల దగ్గర పెరుగుతారు. తల్లిదండ్రులు లేకపోవడం వలన, ఒక అక్కగా అన్నీ తానై తన తమ్ముడు అంకుర్ ను సత్య చూసుకుంటూ వస్తుంది. అతని భవిష్యత్తు కోసం ఆమె ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వరసకి తన సోదరుడైన కబీర్ తో కలిసి బిజినెస్ పనిపై 'హన్షదావో' అనే దీవికి అంకుర్ వెళతాడు. అయితే అక్కడ 'డ్రగ్స్' కి సంబంధించి కబీర్ చేసిన నేరానికి గాను అంకుర్ జైలుకు వెళతాడు. దగ్గర బంధువులు చేసిన మోసం కారణంగా అతనికి మరణశిక్ష ఖాయమవుతుంది. ఈ విషయం తెలిసి సత్య నివ్వెరపోతుంది. తన తమ్ముడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమె ఎంతోమంది అధికారులను కలుసుకుంటుంది. మరణశిక్షను విధించే గడువును పెంచడం తప్ప, దానిని ఆపడం కుదరదని ఆమెకు వాళ్లు చెబుతారు. అక్కడ ఆమెకి శేఖర్ భాటియా అనే మాజీ గ్యాంగ్ స్టర్ తోను .. ముత్తు అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తోను పరిచయం ఏర్పడుతుంది. శేఖర్ భాటియా కొడుకు టోని .. ముత్తు పొరపాటుగా పట్టించిన చందన్ కూడా అదే జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఆ ముగ్గురినీ బయటకి తీసుకు రావడానికి ఈ ముగ్గురూ ఓ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏమిటి? దానిని అమలుపరచడంలో వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అంకుర్ .. టోని .. చందన్ ను వాళ్లు విడిపించగలుగుతారా? ఆ దీవి నుంచి వాళ్లంతా ప్రాణాలతో బయటపడగలుగుతారా? అనేది కథ.


అలియా భట్ చుట్టూనే తిరిగే కథ ఇది. యాక్షన్ .. ఎమోషన్స్  వైపు నుంచి ఆమెకి మరిన్ని మార్కులు దక్కుతాయి. మిగతా పాత్రలను చేసిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణ పరమైన లోపాలు ఎక్కడా కనిపించవు. సెట్స్ కూడా చాలా నేచురల్ గా కనిపిస్తూ, సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. స్వప్నిల్ కెమెరా పనితనం బాగుంది. జైలు నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను .. ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ప్రధానమైన బలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అంచిత్ ఠక్కర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథా భారాన్ని కూడా చివరివరకూ సమర్థవంతంగా మోయగలనని అలియా భట్ మరోమారు నిరూపించిన సినిమా ఇది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com