శివకార్తికేయన్ - సాయిపల్లవి ప్రధానమైన పాత్రలుగా 'అమరన్' సినిమా రూపొందింది. కమల్ హాసన్ - సోనీ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన సినిమా ఇది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. 'మేజర్ ముకుంద్ వరదరాజన్' బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
రివ్యూ: ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) ఇందు రెబెక్కా (సాయి పల్లవి) ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. ఆ సమయంలోనే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడుతుంది .. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. తమ మతాలు వేరు .. ప్రాంతాలు వేరు.. అయినా కలిసి బ్రతకాలని నిర్ణయించుకుంటారు. ఆర్మీలో చేరాలనేది అతని లక్ష్యం. ఆ విషయాన్ని అతను ముందుగానే ఇందుకు చెబుతాడు. అయినా ఆమె తన మనసు మార్చుకోదు. ఇందు మలయాళ అమ్మాయి .. క్రిస్టియన్ కుటుంబానికి చెందిన యువతి. అందువలన వాళ్ల పెళ్లి నిర్ణయం పట్ల ముకుంద్ తల్లి కొంత అసంతృప్తిని ప్రదర్శిస్తుంది. ఆమెకు ముకుంద్ అనేక విధాలుగా నచ్చచెబుతాడు. ఇక తమ ప్రేమ విషయాన్ని ఇందు తన ఇంట్లో చెబుతుంది. ఆమె ముకుంద్ ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తండ్రి తెగేసి చెబుతాడు. మతం.. ప్రాంతం .. భాష సంగతి అలా ఉంచితే, తన కూతురును ఆర్మీలో పనిచేసే వారికి ఇవ్వనని తేల్చేస్తాడు. ఈ విషయం తెలియగానే ముకుంద్ నేరుగా ఇందు తండ్రిని కలిసి, అతనిని ఒప్పిస్తాడు. తన కూతురు సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలగడంతో ఆయన అందుకు అంగీకరిస్తాడు. ముకుంద్ తో ఇందు పెళ్లి జరుగుతుంది .. అతను ఆర్మీలో చేరతాడు .. ధైర్యసాహసాలతో తన స్థాయిని పెంచుకుంటూ వెళతాడు. వారికి ఒక సంతానం కలుగుతుంది. ఆ సమయంలోనే కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు ముకుంద్ ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ.
శివకార్తికేయన్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు ఆయనలో ఒక సోల్జర్ మాత్రమే కనిపిస్తాడు. ఇక ఇందు పాత్రలో మన కళ్లముందున్నది సాయిపల్లవి అనే విషయం మనం మరిచిపోతాం. సర్వం కోల్పోయినప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ కి అతీతంగా ఎలా వెళ్లిపోతారో, అలా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల మనసులను భారం చేస్తాయి. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.