సంధ్య థియేటర్ దుర్ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. ఈ ఘటనకు ఒక్కరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్, ఆయన టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై నాని ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమావాళ్లకు సంబంధించి ఏ విషయంలోనైనా... ప్రభుత్వ అధికారులు, మీడియా చూపిస్తున్న ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, ఈ ఘటనలో అందరి తప్పు ఉందని, ఒకరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.