హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ యూ'. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం.
కథ:
ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. వాసు (సిద్ధార్థ్) తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివసిస్తూ ఉంటాడు. సినిమా డైరెక్టర్ కావాలనేది అతని కోరిక. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. వాసూకి నిజాయితీ .. ఆవేశం రెండూ ఎక్కువే. అందువల్లనే మురళి అనే కుర్రాడి హత్యకేసుకి సంబంధించి, మంత్రి చిరాయుడు (శరత్ లోహితస్య) కొడుకుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. దాంతో ఆ మంత్రి తన అనుచరులతో వాసూకి యాక్సిడెంట్ చేయిస్తాడు. ప్రమాదానికి గురైన వాసూ గత రెండేళ్లుగా తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు మరిచిపోతాడు. అతనికి గతం గుర్తులేదు గనుక చినరాయుడు అంతటితో వదిలేస్తాడు. ప్రమాదం నుంచి కోలుకున్న వాసూకి బాబీ (కరుణాకరన్)తో పరిచయం ఏర్పడుతుంది. అతనితో కలిసి వాసూ బెంగుళూర్ వెళతాడు. బాబీకి అక్కడ ఒక పెద్ద కాఫీ షాప్ ఉంటుంది. అందులో వాసు సరదాగా పనిచేయడం మొదలుపెడతాడు. అక్కడే అతనికి సుబ్బులక్ష్మి ( ఆషిక రంగనాథ్) తారసపడుతుంది. సుబ్బులక్ష్మిని చూడగానే వాసు మనసు పారేసుకుంటాడు. ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తాడు. అందుకు ఆమె కొంత కటువుగానే 'నో' చెబుతుంది. తన పేరెంట్స్ ద్వారా సుబ్బులక్ష్మిని ఒప్పించాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళతాడు. సుబ్బులక్ష్మి ఫొటో చూపించి, తన మనసులోని మాట చెబుతాడు. దాంతో అతని పేరెంట్స్ తో పాటు అక్కడి ఫ్రెండ్స్ కూడా ఉలిక్కి పడతారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ పెళ్లి జరగదని చెబుతారు. అందుకు కారణం ఏమిటి? సుబ్బులక్ష్మి ఎవరు? అంతకుముందు ఏం జరిగింది? అనేది కథ.
రివ్యూ : దర్శకుడు రాజశేఖర్ లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలుపుకుంటూ ఈ కథను తయారు చేసుకున్నాడు. లవ్ ట్రాక్ కి కామెడీని జోడించిన ఆయన, ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేశాడనే చెప్పాలి. హీరోకి ఒక నిజం తెలియడానికి ముందు కథగా ఫస్టాఫ్ .. ఆ నిజం తెలిసిన తరువాత జరిగే కథగా సెకండాఫ్ తెరపైకి వస్తాయి. ఆడియన్స్ గెస్ కి అందని విధంగా కథను అల్లుకున్న తీరు బాగుంది. హీరో - హీరోయిన్ కాంబినేషన్లోని ఒక మూడు నాలుగు సన్నివేశాలు ఈ కథలో చాలా కీలకమైనవిగా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. విలన్ పవర్ఫుల్ .. అయినా ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ ఇవ్వడు. అవసరమైనప్పుడే ఆ పాత్రను తెరపైకి తీసుకుని రావడం కూడా బాగుంది. హీరోయిన్ కీ .. ఆమె తండ్రికి మధ్య గల ఎమోషన్స్ ను దర్శకుడు వర్కౌట్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఈ కథ చాలా నిదానంగా మొదలైనప్పటికీ .. ఆ తరువాత పాకం కుదురుతూ వెళుతుంది. ఒక్కో సన్నివేశాన్ని రివీల్ చేస్తూ వెళ్లే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా అనిపిస్తుంది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఉంది. మరి ఈ సినిమాను థియేటర్స్ లో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించుకుంటే, టైటిల్ మైనస్ అయిందేమోనని అనిపిస్తుంది.